NTV Telugu Site icon

Malaysia: బ్రోకర్‌ మాట నమ్మి విమానం ఎక్కారు.. మలేషియాలో ఖమ్మం వాసుల అవస్థలు

Malaysia

Malaysia

Malaysia: బ్రోకర్ మాటలు నమ్మి మోసపోయారు ఖమ్మం జిల్లా వాసులు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 20 మందిని విడతల వారీగా మలేషియా తీసుకెళ్లాడు బ్రోకర్ నాగబాబు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన నాగబాబు … మధిర నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామానికి చెందినవారిని మోసగించాడు. ఒక్కొక్కరి నుంచి రెండు, మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి టూరిస్ట్‌ వీసాలు ఇప్పించాడు. అవే వర్క్‌ పర్మిట్‌ వీసాలుగా భావించి మలేషియా వెళ్లారు. ఇలా వెళ్లినవారంతా నిరుపేదలే. ఇందులో 11 మంది మహిళలూ ఉన్నారు. వేలల్లో జీతం అనేసరికి సంబరపడి మలేషియా వెళ్లారు. మలేషియాలో ఓ కంపెనీలో పనికి కుదిర్చాడు ఏజెంట్‌. 8 నెలలు బాగానే గడిచింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వర్క్‌ పర్మిట్‌ వీసా లేకపోవడంతో పనిలో నుంచి తీసేసింది మలేషియా కంపెనీ. అదేమని బ్రోకర్‌ను ప్రశ్నిద్ధామంటే అతని ఫోన్‌ స్విచాఫ్‌ చేసేశాడు.

మలేషియాలో ఉపాధి లేక, స్వదేశం వచ్చేందుకు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇంతలోనే బాధితులను మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమ వారిని విడిపించి స్వదేశం తీసుకురావాలని వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. రెండు నెలలుగా తమకు ఫోన్లు రావట్లేదని, తమ వారి యోగక్షేమాలు తెలియట్లేదని వాపోతున్నారు. మలేషియాలో నాయుడు వీళ్లతో పని చేయించుకున్నాడు కానీ డబ్బులు ఇచ్చింది లేదు. ఇప్పుడు స్వదేశం వచ్చేద్దామంటే వీసా సమస్య ఉంది. మలేషియా నుంచి బాధితులు బయటపడాలంటే..ఫైన్‌ కట్టాల్సిందే. ఇప్పటికీ చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రాజుపాలెంలో బాధిత కుటుంబాల్లోని చిన్నారులు, వృద్ధులు…తమ వాళ్లు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమే తమ వాళ్లను విడిపించి తీసుకురావాలని కోరుతున్నారు.

Khammam : 20 మందిని మలేషియా తీసుకెళ్లి..! | Ntv