Rs. 20 Bribe Case: రూ.20 లంచం ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం ఎదుర్కొన్న గుజరాత్‌కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్, నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే అకస్మాత్తుగా మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేజల్‌పూర్ ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసిన బాబూభాయ్ ప్రజాపతి 1996లో రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 1997లో చార్జిషీట్ దాఖలవగా, 2002లో అధికారికంగా అభియోగాలు మోపారు.
Read Also: Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్‌లో మజీద్‌ను మేమే పేల్చేశాం.. ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన..
ఇక, సాక్షుల వాంగ్మూలాల నమోదు 2003లో ప్రారంభమై, 2004లో అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు బాబూభాయ్ ప్రజాపతిని దోషిగా నిర్ధారించింది. అవినీతి నేరానికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ కేసు హైకోర్టులో కొనసాగింది. చివరికి 2026 ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సాక్షుల వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడం.. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ బాబూభాయ్ ప్రజాపతిని నిర్దోషిగా విడుదల చేసింది.
అయితే, కానిస్టేబుల్ తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఆరోపణలను నిరూపించేందుకు బలమైన ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను అంగీకరించిన హైకోర్టు, 30 ఏళ్ల నాటి కళంకాన్ని తొలగిస్తూ విముక్తి కల్పించింది. తీర్పు వెలువడిన అనంతరం బాబూభాయ్ ప్రజాపతి తన న్యాయవాది కార్యాలయానికి వెళ్లారు. నిర్దోషిగా విడుదలైన తర్వాత నిలిపివేయబడిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయవాది సూచించారు. ఈ సందర్భంగా బాబూభాయ్ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంపై ఉన్న మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు నన్ను తన దగ్గరకు పిలవాలి అని ఆయన అన్న మాటలు కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. అనంతరం ఆయన ఇంటికి వెళ్లారు. అయితే న్యాయం దక్కిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మరుసటి రోజే బాబూభాయ్ ప్రజాపతి అకస్మాత్తుగా మరణించారు.
