NTV Telugu Site icon

Nuh Violence: నూహ్‌లో మూడో రోజు బుల్డోజర్ యాక్షన్.. మెడికల్ షాపులు, దుకాణాలు కూల్చివేత

Nuh Violence

Nuh Violence

Nuh Violence: హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన మత హింసకు కారణమైన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘బుల్డోజర్ చర్య’ చేపట్టింది. నూహ్‌ జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్ చర్య కొనసాగుతోంది. అల్లర్లకు దెబ్బతిన్న నుహ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని తావ్‌డూ పట్టణంలో శుక్రవారం అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇళ్లు, గుడిసెల్లో అక్రమ వలసదారులు చట్టవిరుద్ధంగా ఉంటున్నారని, గత నెల 31న జరిగిన అల్లర్లలో వాళ్లే పాల్గొన్నారని అధికారులు ధ్రువీకరించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు నుహ్ ఎస్డీఎం అశ్విని కుమార్ తెలిపారు. ‘ఇది సీఎం ఆదేశాల మేరకే.. ఇదంతా అక్రమ కట్టడాలు. ఇక్కడ ఉన్న వాళ్లే ఈ అల్లర్లకు పాల్పడ్డారు’ అని కుమార్ తెలిపారు. శుక్రవారం కూడా ఈ ప్రాంతంలో అక్రమ వలసదారుల ఆక్రమణలను ధ్వంసం చేశారు.

సీఎం ఆదేశాలతోనే..
తాజాగా శనివారం ఉదయం నల్హార్‌ ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు. ఆసుపత్రి వద్ద ఉన్న మెడికల్‌ షాపులు, ఇతర దుకాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాలను బుల్డోజర్ల సాయంతో తొలగిస్తున్నారు. ఈ ఒక్కరోజే 50 నుంచి 60 నిర్మాణాలను పడగొట్టినట్లు అధికారులు తెలిపారు. అరెస్టులకు భయపడి ఈ దుకాణాదారులు పారిపోయినట్లు అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాలతోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతోనే అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలిసింది.

నూహ్‌లో అల్లర్లు తీవ్రదుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టడం గమనార్హం. ఇటీవల అల్లర్లకు పాల్పడిన నిందితులను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారని, వారు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లనే ఇప్పుడు నేలమట్టం చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. ఇవన్నీ అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలనేనని, వీటిని తొలగించాలని ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. అల్లర్లకు ఈ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

ముందస్తు ప్రణాళికే.. 

హర్యానాలోని నుహ్ జిల్లాలో మత ఘర్షణలు ముందస్తు ప్రణాళికేనని రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. నుహ్‌లో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం గురించి తన వద్ద ఎటువంటి సమాచారం లేదని అన్నారు. నుహ్‌ అల్లర్ల గురించి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఇవ్వలేదన్నారు. తాను ఏసీఎస్ (హోమ్), డీజీపీని కూడా అడిగానని, వారు కూడా తమ వద్ద సమాచారం లేదని చెప్పారన్నారు. ఇప్పుడు సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ తనకు అన్నీ ముందే తెలుసునని చెప్పిన వీడియో వైరల్‌ అవుతోంది. అతనికి తెలిస్తే, ఈ విషయం ఎవరికి తెలియజేశాడని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక కుట్ర ఉందని, రెండు వర్గాలు చాలా కాలంగా నుహ్‌లో శాంతియుతంగా ఉంటున్నాయని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు.కొండలపై నుంచి బుల్లెట్లు పేల్చిన తీరు, భవనాల పైకప్పులపై సేకరించిన రాళ్లు నుహ్ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు సూచిస్తోందని మంత్రి శుక్రవారం అన్నారు. ప్రతి వ్యక్తి చేతిలో లాఠీ ఉంది కాబట్టి ఇది పెద్ద గేమ్‌ ప్లాన్‌ అని ఆయన అన్నారు. అంతేగాక, ఘర్షణల గురించి తనకు కొన్ని గంటల తర్వాత తెలిసిందని మంత్రి చెప్పడం గమనార్హం. పోలీసులు, ప్రభుత్వ అధికారులెవరూ తనకు సమాచారం ఇవ్వలేదని, ఓ ప్రైవేటు వ్యక్తి తనకు ఫోన్‌ చేసి అల్లర్ల విషయం చెప్పారని ఆయన అన్నారు.

హింస ఎలా మొదలైంది..
హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పి) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ముగ్గురు పౌరులు, ఒక ఇమామ్‌తో సహా ఆరుగురు మరణించారు. పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. నుహ్ జిల్లాలోని నంద్ గ్రామ సమీపంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు.గోసంరక్షకుల నివేదికలపై ఘర్షణలు చెలరేగడంతో వాహనాలను తగులబెట్టారు. రాళ్లు విసిరారు. ఇదిలా ఉండగా.. నుహ్‌లో జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు పోలీసులు 102 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. దాదాపు 200 మందిని అరెస్టు చేశారు. మరో 80 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show comments