NTV Telugu Site icon

Child Save Many Lives: 18 నెలల చిన్నారి.. చాలా మంది ప్రాణాలను కాపాడింది..

Child Save Lives

Child Save Lives

Child Save Many Lives:: మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు. కారణజన్ములుగా కీర్తింపబడుతూ ఎంతో మంది తల్లులకు కడుపుకోత తీర్చే దేవతామూర్తులుగా నిలుస్తారు. హర్యానాకు చెందిన 18 నెలల చిన్నారి మహీరా కూడా ఈ కోవకే చెందుతుంది. బాల్కనీ నుంచి పడి బ్రెయిన్‌ డెడ్ కాగా… ఆమె అవయవాలు దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. బిడ్డను కోల్పోయామనే బాధను దిగమింగుకుని చాలా మందికి కొత్త జీవితం ప్రసాదించేందుకు సిద్ధమయ్యారు.

నవంబర్ 6న హర్యానాలోని మేవాత్, నూహ్‌లోని తన ఇంటి బాల్కనీ నుండి పడిపోయిన మహీరా మెదడుకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యం నవంబర్ 11న ఉదయం ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో.. అదే ఆస్పత్రిలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ వేదన అనుభవిస్తున్న పేషెంట్ల పరిస్థితిని కళ్లారా చూసిన చిన్నారి తల్లిదండ్రులు.. తమ బుజ్జాయి ద్వారా వారి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. వైద్యులను సంప్రదించి.. తమ నిర్ణయాన్ని చెప్పగా వారు అందుకు అంగీకరించారు. దీంతో చాలా మందికి కొత్త జీవితం లభించనుంది. ఆ చిన్నారి తన కాలేయాన్ని ఢిల్లీలో ఓ ఆరేళ్ల చిన్నారికి దానం చేసింది. రెండు కిడ్నీలను మహీరా ఎయిమ్స్‌లో 17 ఏళ్ల రోగికి అమర్చారు. గుండె కవాటాలు, కార్నియా భద్రపరచబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ.. ఇంతటి విషాదంలోనూ ధైర్యం ప్రదర్శించి.. స్వచ్చందంగా అవయవదానానికి ముందుకు వచ్చిన మహీరా తల్లిదండ్రులను ప్రశంసించారు. ఇక ఆ చిన్నారి తల్లిదండ్రులు తాము బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని, అవయవదానం తర్వాత వారిలో తమ పాప బతికి ఉంటుందనే సంతోషమైనా మిగులుతుందని ఆ చిన్నారి తండ్రి చెప్పాడు.

Mallojula Venugopal: తల్లి మరణంపై మావోయిస్టు నేత వేణుగోపాల్ భావోద్వేగ లేఖ

అదే విధంగా అవయవదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతిరోజూ ఎంతో మంది అభాగ్యులు కన్నుమూస్తున్నారని మహిరా తల్లిదండ్రుల్లా ఆలోచిస్తే అలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. కాగా భారత్‌లో సగటున ప్రతి ఏడాది సుమారు 5 లక్షల మంది అవయవాలు దెబ్బతినడం వల్ల మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి మనం కూడా వీలైనంత ఎక్కువగా అవయవదానం చేయడం సహా ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ జీవితానంతరం కూడా ఈ లోకంలో మన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారి మహీరాలాగే మరికొంత మందిని బతికిద్దాం.

Show comments