NTV Telugu Site icon

Viral Video: 270 కేజీల బరువు ఎత్తబోయి ప్రాణాలు పోగొట్టుకున్న వెయిట్‌లిఫ్టర్..

Viral Video

Viral Video

Viral Video: దేశం గర్వించేలా పవర్ లిఫ్టింగ్‌లో రాణించాలని అనుకున్న 17 ఏళ్ల యష్టికా ఆచార్య జరిగిన ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌లో మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. బడా గణేష్‌ జీ టెంపుల్‌ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్‌ జిమ్‌లో యష్టికా ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యష్టికా తన కోచ్‌ పర్యవేక్షణలో 270 కేజీల బరువును లిఫ్ట్‌ చేయడానికి ప్రయత్నించింది. అయితే, అనూహ్యంగా బ్యాలెన్స్‌ తప్పి ఆ భారీ బరువు నేరుగా ఆమె మెడపై ఒక్కసారిగా పడింది.

Read Also: iPhone 16e: ఆపిల్ కొత్త ఐఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా

ఈ ఘటనను చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న జిమ్‌ సభ్యులు, కోచ్‌ పరుగున వచ్చి బరువును తొలగించారు. ఆపై సీపీఆర్‌ కూడా అందించారు. కానీ, అప్పటికే యష్టికా స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత యష్టికాను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధృవీకరించారు. యష్టికా మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు, సహచర క్రీడాకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

చిన్న వయసులోనే యష్టికా పవర్ లిఫ్టింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచింది. 29వ రాజస్థాన్‌ స్టేట్‌ సబ్-జూనియర్‌ & సీనియర్‌ బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌, 33వ నేషనల్‌ బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఆమె కుటుంబ సభ్యుల ప్రకారం, యష్టికా క్రీడా రంగంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కలలు కనింది. కానీ ఈ అనూహ్య ప్రమాదం ఆమె జీవితాన్ని అర్ధంతరంగా ముగించిందని తెలిపారు. ఇక యష్టికా కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి ఐశ్వర్య ఆచార్య అలియాస్‌ ధింగానియా మహారాజ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారిలో ఒకరు పవర్‌ లిఫ్టర్‌ కూడా. ఇక ఈ ఘటనపై వారు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: Shabdham : వైశాలి సీక్వెల్ ‘శబ్దం’ ట్రైలర్ రిలీజ్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిట్‌నెస్, వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసే వారిలో ఇది తీవ్రమైన ఆందోళన రేకెత్తించింది. అధిక బరువును ఎత్తే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం, కోచ్‌ పర్యవేక్షణ మరింత కీలకం అని నిపుణులు చెబుతున్నారు. యష్టికా మృతి క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఓ ప్రతిభావంతమైన క్రీడాకారిణి అకాల మరణం అందరినీ కలచివేసింది. ఆమెకు నివాళులు అర్పిస్తూ క్రీడా రంగ ప్రముఖులు, శిక్షకులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.