కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను మరవకముందే తమిళనాడులో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఎన్‌సీసీ క్యాంప్ అంటూ నమ్మించి.. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో పాటు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు. ఆగస్టు మొదటి వారంలో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం… నామ్ తమిళర్ కట్చి అనే రాజకీయ పార్టీకి చెందిన 30 ఏళ్ల శివరామన్ ఇటీవల కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లాడు. ఆ స్కూల్‌లో ఎన్‌సీసీ విద్యార్ధి బృందం లేనప్పటికీ.. క్యాంప్ నిర్వహిస్తామని చెప్పాడు. ఈ క్యాంప్ నిర్వహిస్తే ఎన్‌సీసీ యూనిట్‌కు స్కూల్ అర్హత సాధిస్తుందని అతడు యాజమాన్యంకుమాయమాటలు చెప్పాడు. శివరామన్ మాటలను నమ్మి.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండానే క్యాంప్‌కు స్కూల్ మేనేజ్‌మెంట్ ఓకే చెప్పింది.
ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించిన ఎన్‌సీసీ క్యాంప్‌కు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 17 మంది బాలికలు ఉన్నారు. అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్ ఆడిటోరియంలో, అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. ఈ ఎన్‌సీసీ క్యాంప్‌ను పర్యవేక్షించేందుకు స్కూల్ మేనేజ్‌మెంట్ ఎవరినీ నియమించలేదు. ఇదే అదునుగా 8వ తరగతి చదవుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై శివరామన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే కొడుతానని, చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు మరో 12 మంది బాలికలను లైంగికంగా వేధించాడు.
Also Read: Vinesh Phogat: అస్వస్థతకు గురైన వినేశ్ ఫొగాట్!
ఆగస్టు 9న బాధిత బాలిక విషయాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్‌కు చెప్పింది. స్కూల్ పరువుపోతుందని భావించిన ప్రిన్సిపల్ సతీష్ కుమార్.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎన్‌సీసీ క్యాంప్ ముగిసిన అనంతరం బాధిత అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఆగస్టు 16న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి వెళ్లగా.. అసలు విషయం తల్లిదండ్రులకు తెలిసింది. బాలిక తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శివరామన్, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు సహా మొత్తం 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. నామ్ తమిళర్ కట్చి పార్టీ చీఫ్ సీమాన్ అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు.
