NTV Telugu Site icon

Ranji Trophy: రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న 12th ఫెయిల్ డైరక్టర్ కొడుకు.. తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!

Agni Dev Chopra

Agni Dev Chopra

Agni Dev Chopra Becomes 1st Batter to Hits 4 Centuries in Ranji Trophy: రంజీ ట్రోఫీ 2024లో బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్నిదేవ్ చోప్రా అదరగొడుతున్నాడు. వరుస శతకాలతో హోరెత్తిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో 4 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా అగ్నిదేవ్ అరుదైన రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేసిన అగ్నిదేవ్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌తో రంజీల్లోకి అగ్నిదేవ్ అరంగేట్రం చేశాడు. తండ్రి సినిమాల్లో హిట్‌లు సాధిస్తుంటే.. కొడుకు మైదానాల్లో సెంచరీలు బాదుతుండటం విశేషం.

రంజీ ట్రోఫీ 2024లో భాగంగా సిక్కింపై అరంగేట్రం చేసిన అగ్నిదేవ్ చోప్రా సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు చేసిన అగ్నిదేవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. నాగాలాండ్‌పై (164,15), అరుణాచల్ ప్రదేశ్‌పై (114, 10), మేఘాలయపై (105, 101) పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అగ్నిదేవ్ తొలి సీజన్‌లో ఐదు సెంచరీలతో కొత్త రంజీ ట్రోఫీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగ్నిదేవ్.. 767 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది.

Also Read: IND vs ENG: పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. బషీర్‌ను తుది జట్టులోకి తీసుకుంటాం: బెన్ స్టోక్స్

అగ్నిదేవ్ చోప్రా 1998 నవంబర్ 4న జన్మించాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా, జర్నలిస్ట్ అనుపమ చోప్రా కుమారుడే అగ్నిదేవ్. 25 ఏళ్ల అగ్నిదేవ్ ముంబైలో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. ముంబై తరఫున అండర్ 19, అండర్ 23 జట్లతో ఆడినా పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత మిజోరం తరఫున బరిలోకి దిగాడు. మిజోరం తరఫున టీ20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతడు 200లకు పైగా రన్స్ చేశాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీ 2024లో సెంచరీలతో చెలరేగుతున్నాడు.