NTV Telugu Site icon

Lord Ganesh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా..?

Ganesh

Ganesh

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఊరు, వాడ మొత్తం గణేశుని నామస్మరణతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం.. సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనంతో ముగుస్తుంది.

ఇదిలా ఉంటే.. గణేష్ ఉత్సవాలు మొదలవగానే అతిపెద్ద వినాయకుడి విగ్రహాలు ఎక్కడున్నాయి.. ఏ ప్రాంతంలో భారీ గణనాథులను ఏర్పాటు చేశారనే ప్రశ్నలు మొదలవుతాయి. అయితే.. మన భారతదేశంలోనే కాదు వేరే దేశంలో కూడా గణపతి భారీ విగ్రహం ఉంది. అది ఎక్కడంటే.. థాయిలాండ్, ఖ్లాంగ్ ఖ్వాన్ ప్రాంతంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 128 అడుగులు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా గుర్తింపు పొందింది.

Delhi: ఢిల్లీలో బాణాసంచా తయారీ, ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం..

ఈ విగ్రహాన్ని ఎప్పుడు స్థాపించారు:
థాయ్‌లాండ్‌లోని చాచోయింగ్‌షావో నగరం.. సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 3 భారీ వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అతి పెద్దది. ఈ విగ్రహాన్ని 2012 సంవత్సరంలో ఖ్లాంగ్ ఖ్వెన్ ప్రాంతంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో స్థాపించారు. దీని నిర్మాణానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. విగ్రహం తయారీ పనులు 2008 నుండి 2012 వరకు జరిగాయి. ఈ భారీ విగ్రహాన్ని కాంస్యంతో నిర్మించారు. విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. తల భాగంలో తామర పువ్వు.. మధ్యలో ఓం చిహ్నం ఉంటుంది. ఈ గణనాథుడిని నిలుచుని ఉన్నట్లు తయారు చేశారు. విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి.

ఈ భారీ విగ్రహంతో పాటు గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో మొత్తం 32 వినాయక విగ్రహాలు వివిధ భంగిమల్లో తయారు చేశారు. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. అందులో మీరు గణేశ విగ్రహాలు, గణేశుడి వివిధ రూపాల గురించి తెలుసుకోవచ్చు. థాయ్‌లాండ్‌తో పాటు.. ఈ పార్క్ కు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌లో బౌద్ధమతాన్ని అనుసరించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రజలు గణేశుడిపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. గణేష్ చవితి వంటి ప్రత్యేక సందర్భాలలో ఈ పార్కు, ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఈ పార్క్‌లో 128 అడుగుల ఎత్తైన గణేశ విగ్రహమే కాకుండా.. ఫాంగ్ అకత్ టెంపుల్‌లో 49 మీటర్ల ఎత్తైన గణేశ విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడ గణేశుడు కూర్చున్నట్లు తయారు చేశారు. ఈ విగ్రహాన్ని చాలా అందంగా.. రంగులతో అలంకరించారు. అంతే కాకుండా.. సమన్ వత్తనారం ఆలయంలో 16 మీటర్ల ఎత్తు, 22 మీటర్ల పొడవు గల గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇందులో వినాయకుడు సగం శయన స్థితిలో ఉన్నాడు. ఈ విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. ప్రకాశవంతమైన రంగులతో ఈ విగ్రహానికి అలంకరించారు.

Show comments