NTV Telugu Site icon

Russia-Ukraine War: రష్యాకు గట్టి ఎదురుదెబ్బ.. 24 గంటల్లో 1000 మంది సైనికులు మృతి

Russian Soldiers

Russian Soldiers

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై 8 నెలలగా విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఉక్రెయిన్‌ భూభాగాలపై బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై కీవ్‌ సేనలు ప్రతిదాడులకు దిగాయి. సరైన ఆయుధాలు లేని రష్యా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ దాడులు చేసింది. రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ బలగాలు 24 గంటల వ్యవధిలో 1000 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు తెలుస్తోంది. సరైన ఆయుధాలు లేకుండా యుద్ధరంగంలోకి వచ్చిన రష్యా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక, రష్యా ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో సైనికులను కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 71,200 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు వెల్లడించింది.

వీరిలో చాలా మంది రిజర్విస్టులే కావడం గమనార్హం. అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని ఇటీవల బ్రిటిష్‌ రక్షణ నిఘా వర్గాల నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ సేనలు వారిపై దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కోసం ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సైనిక సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనేక మంది రిజర్విస్టులను వెనక్కి పిలిపించి ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపించారు. రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

Extramarital Affair: ప్రియుడి మోజులో భర్తని చంపించింది.. 24 గంటల్లోనే బుక్కైంది

ఇదిలావుండగా.. క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేసినప్పటి నుంచి రష్యా ఆ దేశంపై భీకర దాడులకు దిగిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై దాడికి దిగింది. రాజధాని కీవ్‌తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేసింది. ఈ దాడుల కారణంగా 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. కొన్ని రోజుల కిందట పదుల సంఖ్యలో క్షిపణులతో రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో కీవ్‌లో అంధకారం నెలకొంది, తాగునీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, కొన్నిరోజుల వ్యవధిలోనే కీవ్ లో విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది.