కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ రావడంతో కూల్ డ్రింక్స్ అమ్ముకునే చిరు వ్యాపారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. రూ.66 కోట్ల లావాదేవీలు జరిగాయని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అడ్రస్‌కు వచ్చి.. షాపుకు చూసి కంగుతిన్నారు. ఎంక్వయిరీ చేయగా కూల్ డ్రింక్స్ వ్యాపారి నెంబర్‌పై వేరే వారు లావాదేవీలు నడిపినట్టు తేలింది. నెలలు గడుస్తున్నా పరిష్కారం లేకపోవడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది.
ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన పంచకర్ల విజయబాబు కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తున్నాడు. చిరు వ్యాపారం చేసుకునే విజయబాబుకు ఏకంగా కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ వచ్చింది. కోటి రూపాయలు కట్టమని నోటీస్ రావడంతో అతడు షాక్ తిన్నాడు. గతంలో విజయబాబు తన స్నేహితుడి సలహాతో జీఎస్టీ కట్టడానికి ఓ అకౌంటెంట్‌ను కలిసి.. జీఎస్టీ నెంబర్ తీసుకున్నాడు. ఆ నెంబర్‌పై క్రాప్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ రూ.66 కోట్లు లావాదేవీలు జరిగాయని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అడ్రస్‌కు వచ్చారు. తీరా చూస్తే అధికారులకు చిన్న కూల్డ్రింక్స్ అమ్ముకునే షాపు కనపడింది. షాపు చూసి అధికారులు ఆవాక్కయ్యారు.
విజయబాబును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ప్రశ్నలు వేయగా.. తనకు ఏమీ తెలియదని చెప్పాడు. ఎంక్వయిరీ చేయగా ఇతని నెంబర్‌పై వేరే వారు లావాదేవీలు నడిపినట్టు అకౌంటెంట్ చూపించారు. దీనిని అకౌంటెంట్ తప్పిదంగా అధికారులు భావించారు. అకౌంటెంట్‌ని నమ్మి మోసపోయానని విజయబాబు లబోదిపోమన్నాడు. అకౌంటెంట్‌ని నిలదీయగా ఎక్కడో పొరపాటు పడిందని, సరిచేస్తానంటూ చెప్పాడు. నెలలు గడుస్తున్నా పరిష్కారం లేకపోవడంతో విజయబాబు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.