NTV Telugu Site icon

Minister Narayana: కోటి 95 లక్షలతో నిర్మించిన పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ!

Minister Narayana

Minister Narayana

నగర పాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డా.పి.నారాయణ అన్నారు. ఈరోజు స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన కోటి 95 లక్షల 85 వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు)ను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ… ‘రాజమహేంద్రవరంలో నూతనంగా ప్రారంభించుకున్న పెట్రోల్ బంకును స్ఫూర్తిదాయంగా తీసుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం టాక్స్ లను ఎన్నోసార్లు పెంచారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు సంబంధించి వినియోగిస్తున్న వాహనాల ఆయిల్స్ ప్రతి నెలా రూ.25.54 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఆర్ఎమ్సీ ద్వారా ఐఒసిఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంకు ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుంది. ఈ పెట్రోల్ బంకు నిర్మాణానికి నగరపాలక సంస్థ అందుకు అవసరమయ్యే స్థలాన్ని అందించింది. ఈ బంక్ ఏర్పాటు ద్వారా రోజుకు రు.3 లక్ష రూపాయలు టర్నోవర్ జరుగుతుంది’ అని అన్నారు.

‘గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు టాక్స్ రూపంలో కట్టిన రూ.3,200 కోట్లు పురపాలక సంఘాలకు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ఇప్పటికే తొలి విడతగా పురపాలక సంఘాలకు 15వ ఆర్థిక నిధులు ఇవ్వడం జరిగింది, రెండో విడత కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి నారాయణ తెలిపారు. శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. ఈ బంక్ నిర్వాహణలో స్వయం సంఘాలోని మహిళకు ఉపాధి కల్పించే విధంగా వారిని నిర్వాహణ విధుల్లోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు.