Site icon NTV Telugu

Presidential poll: రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన

Vijaya

Vijaya

రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అవుతున్నారు. అయితే ఆమెతో భేటీకి పలువురు సీఎంలు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్వహించనున్న సమావేశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా తమకు ఎలాంటి ఆహ్వానం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికి మద్దతివ్వాలనే విషయంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్షం తమ అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై స్పందిస్తూ… కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలను అనుభవించాల్సిందేనని అన్నారు. సోనియా, రాహుల్‌లపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడటం లేదని చెప్పారు. సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిల్ పైనే విచారణ సాగుతోందని అన్నారు. ఈడీ విచారణకు రాజకీయాలను ఆపాదించడం తగదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్‌, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడే అభ్యర్థిని ప్రకటించకుండా.. మద్దతు ఇవ్వాలని కోరడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఇదే సమయంలో.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

Exit mobile version