‘అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం’ అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. అయితే మహిళల ప్రాతినిధ్యం రానురాను తగ్గిపోతోంది. లోక్‌సభలో 14.94 శాతం, రాజ్యసభలో 14.05 శాతం మాత్రమే మహిళా ప్రతినిధులు వున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు వివరాలు వెల్లడించింది కేంద్రం. దేశవ్యాప్తంగా పార్లమెంటు సహా వివిధ శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తోంది.
Read Also: Bhupendrabhai Patel: నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం
వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో వీరి సంఖ్య 10 శాతం లోపే ఉంది. 10 శాతాన్ని మించి ఛత్తీస్‌గఢ్ (14.44), పశ్చిమబెంగాల్ (13.70), జార్ఖండ్ (12.35), రాజస్థాన్ (12), ఉత్తర్‌ప్రదేశ్ (11.66), ఉత్తరాఖండ్ (11.43), దిల్లీ (11.43), పంజాబ్ (11.11), బిహార్ (10.70), హరియాణా (10) ఉన్నాయి. 10 శాతం కంటే మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణలు ఉన్నాయి. మొత్తం మీద దేశంలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పరిశీలిస్తే..వారి వాటా కేవలం ఎనిమిది శాతంగానే ఉంది. లోక్‌సభలో మహిళా ఎంపీలు 14.94 శాతం, రాజ్యసభలో 14.05 శాతంగా ఉన్నారు. ఈ నెల 9న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడించారు.
మహిళల హక్కుల గురించి మాట్లాడే పార్టీలు కూడా వారికి ఎలాంటి హక్కులు ఇవ్వడం లేదు. సీట్లు ఇవ్వాలంటే వందసార్లు ఆలోచిస్తున్నాయి. సాధికారికత దృష్ట్యా చూసినప్పుడు మహిళలు ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే ఉన్నారు కానీ రాజకీయాల్లో శాసించే స్థాయిలో లేరనేది వాస్తవం. రాజకీయ చైతన్యం పెరిగినప్పుడు, ఆర్థిక స్వాతంత్య్రం లభించినప్పుడే అనుకున్నది సాధ్యమౌతుంది. కేవలం శుష్క వాగ్దానాలతో కోరుకున్న మార్పులు రావు. లోక్‌సభ అనుమతి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి.
Read Also:School Bus Overturned: నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థినిలకు గాయాలు
పాలక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఈ బిల్లుపట్ల వ్యవహరిస్తున్నాయి. అందుకే ఈబిల్లు మూడడుగుఉల ముందుకి, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఒకటి రెండు రాజకీయ పార్టీలు మినహా అన్ని పార్టీలూ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కావాలంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ బిల్లుకు మోకాలడ్డుతున్నాయి. మహిళలకు సీట్లు ఇచ్చినప్పుడే వారి హక్కుల పరిరక్షణకు ముందడుగు పడుతుందని భావించవచ్చు.
