NTV Telugu Site icon

Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

Woman Stripped Airport

Woman Stripped Airport

Woman Says She Was Strip Searched At Bengaluru Airport: తనిఖీ పేరుతో బెంగుళూరు ఎయిర్‌పోర్టులో తన చొక్కా విప్పించారని కృషాని గాధ్వి అనే ఓ మహిళ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఒక మహిళ అని చూడకుండా, భద్రతా తనిఖీల సమయంలో తనతో బలవంతంగా దుస్తులు తొలగించారని.. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. ఆ దారుణ పరిస్థితుల్లో తాను లోదుస్తుల్లో నిల్చోవాల్సి వచ్చిందని, ఇది తనకు చాలా అవమానకరమని తెలిపింది. ఒక మహిళగా ఎలాంటి పరిణామాలైతే ఎదురవ్వకూడదని కోరుకుంటామో, అలాంటి ఘోర పరిస్థితి తనకు ఎయిర్‌పోర్టులో ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మహిళతో చొక్కా విప్పించాల్సిన అవసరం ఏముందంటూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించింది.

ఈ విధంగా కృషాని చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా బెంగుళూరు ఎయిర్‌పోర్టు సిబ్బందిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బెంగళూరు ఎయిర్‌పోర్టు.. సెక్యూరిటీతో మాట్లాడి, ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి మళ్లీ ఎలాంటి స్పందన రాలేదు. సెక్యూరిటీ టీమ్ సీఐఎస్ఎఫ్‌కు సంబంధించిన వారు కాబట్టి, వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. దీనిపై సీఐఎస్ఎఫ్ బృందమే తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, కృషాని గాధ్వి చేసిన ఆరోపణలు అవాస్తవమని బీజేపీ లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్ పేర్కొన్నారు. ఒక మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే ఆమెని తనిఖీ చేసినట్లు వెల్లడించారు.

‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా విప్పించారని ఒక మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఆమె బ్యాడ్జీలు, బీడింగ్‌లతో కూడిన డెనిమ్ జాకెట్ ధరించింది. ఒక మహిళా సిబ్బందితో ప్రైవేట్‌గా పరీక్షించబడింది’’ అంటూ పీసీ మోహన్ ట్వీట్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? కృషాని గాధ్వి ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత తన అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసింది. దీంతో.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కేవలం అటెన్షన్ పొందడం కోసం ఆ ట్వీట్ చేసిందా? లేక ఎవరైనా అకౌంట్ డీయాక్టివేట్ చేయించారా? అనేది మిస్టరీగా మారింది. చూస్తుంటే, కేవలం ఆన్‌లైన్‌లో పబ్లిసిటీ పొందడం కోసమే ఆ యువతి ఆ పని చేసినట్టుగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.