Site icon NTV Telugu

Hair dryer blast: హెయిర్ డ్రైయర్ పేలి చేతులు కోల్పోయిన మహిళ..

Hair Dryer Blast

Hair Dryer Blast

Hair dryer blast: విచిత్రమైన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి చేతులను కోల్పోవాల్సి వచ్చింది. ‘‘హెయిర్ డ్రైయర్’’ పేలడంతో మహిళ తన రెండు చేతుల్ని మోచేతుల వరకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఇల్కల్ పట్టణంలో బుధవారం జరిగింది. హెయిర్ డ్రైయర్‌ని పరిశీలిస్తున్న సమయంలో అది పేలడంతో బసమ్మ యారనల్ అనే బాధితురాలు తీవ్రంగా గాయపడింది.

పేలుడు తీవ్రతకు బసమ్మ చేతి వేళ్లు పగిలిపోయాయి. ముంజేతులు వరకు తీవ్రగాయాలయ్యాయి, ఇళ్లంతా రక్తంతో నిండింది. పొరుగుంటిలోని శశికళకు వెళ్లాల్సిన హెయిర్ డ్రైయర్ పార్సిల్‌ని ఆమె లేకపోవడంతో బసమ్మ తీసుకుంది. డీటీడీసీ కొరియర్ ద్వారా పార్సిల్ వచ్చిందని, దానిపై శశికళ పేరు, మొబైల్ నెంబర్ ఉందని బసమ్మ తెలిపింది. శశికళ వేరే ఊరిలో ఉండటంతో, ఆమె పార్సిల్‌ని బసమ్మ తీసుకుంది.

Read Also: Ukraine-Russia War: ఉక్రెయిన్‌లో ఎంబసీల మూసివేతకు పలు దేశాలు పిలుపు

శశికళ, బసమ్మ ఇద్దరూ కూడా మరణించిన సైనికుల భార్యలు. బసమ్మ హెయిర్ డ్రైయర్ ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతూహాలంతో ఉపయోగించిందని పోలీసులు తెలిపారు. ఆమె కనెక్షన్‌ ఇచ్చి ఉపయోగించిన కొద్ది క్షణాలకే భారీ శబ్ధంతో డ్రైయర్ పేలిపోవడంతో తీవ్రగాయాలపాలైంది. బసమ్మని ఇల్కల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, ఇల్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, శశికళ మాత్రం తాను ఎలాంటి హెయిర్ డ్రైయర్ఆర్డర్ చేయలేదని చెప్పడంతో, ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఎవరు ఆర్డర్ పెట్టారు..? ఇది ఇల్కల్‌కని ఎలా చేరిందనే దానిని అధికారులు విచారణ చేస్తున్నారు. సమగ్ర విచారణ జరుగుతున్నట్లు బాగల్‌కోట్ ఎస్పీ అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. అయితే, ఈ కేసులో తాము ఎలక్ట్రిక్ ఇన్‌స్పెక్టర్ నుంచి అభిప్రాయాలను కోరామని, హెయిర్ డ్రైయర్ ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారుడు మాన్యువల్‌ని అనుసరించలేదని, వోల్టేజ్ అవసరం కన్నా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ హెయిర్ డ్రైయర్‌ని తయారు చేసిన చైనీసీ కంపెనీ కెమీ హెయిర్ డ్రైయర్ అని పోలీస్ అధికారి చెప్పారు.

Exit mobile version