Mumbai: కోల్‌కతా వైద్యురాలి ఘటన మరవక ముందే దేశంలో పలు చోట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై ఓ రోగి, అతని బంధువులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తెల్లవారుజామున 3.30 గంటలకు ఆస్పత్రిలో వైద్యురాలు వార్డులో షిఫ్ట్‌లో ఉండగా దాడి జరిగింది. ఆస్పత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోగి ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రికి వచ్చాడు. ముఖానికి గాయాలు, తీవ్ర రక్తస్రావం ఉన్న రోగిని ఈఎన్‌టీ స్పెషలిస్ట్ విభాగానికి పంపారు. అతడికి చికిత్స చేస్తున్న సమయంలో వైద్యురాలిని రోగి, అతని బంధువులు దూషించడం ప్రారంభించారు. ఆమె రోగికి సరైన చికిత్స అందించడం లేదని ఆరోపిస్తూ రోగి డాక్టర్‌ని తోసేయడంతో పాటు భౌతికదాడికి తెగబడ్డాడు.
వైద్యురాలు గాయాన్ని పరిశీలించేందుకు రోగి ముఖాన్ని పరిశీలించే క్రమంలో కాటన్ డ్రెస్సింగ్‌ని జాగ్రత్తగా తీసేసే సమయంలో రోగికి నొప్పి కలగడంతో బంధువులు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి స్పల్పగాయాలయ్యాయి. గాయాలతో ఉన్న రోగితో పాటు అతని 7-8 మంది బంధువులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్య తర్వాత దేశవ్యాప్తంగా వైద్యులు మరియు వైద్య సోదరుల నిరసనల మధ్య ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై వైద్యురాలు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.