Site icon NTV Telugu

Wipro- Walk In Interviews: విప్రో వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు

Wipro

Wipro

Wipro- Walk In Interviews: దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేంద్రంతోపాటు.. రాష్ట్రాలు నోటిఫికేషన్లను ఇస్తే పోస్టులు వందల్లో ఉన్నా.. దరఖాస్తులు లక్షల్లో ఉంటున్నాయి. చిన్న అటెండర్‌ స్థాయి ఉద్యోగానికి కూడా పీహెచ్‌డీ పూర్తయిన వారు దరఖాస్తు చేస్తున్న ఘటనలను చూస్తున్నాము. ఇక ఉద్యోగాల్లో అత్యధిక వేతనం పొందేది సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలు. సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు కూడా ఈ మధ్య కాలంలో నిరుద్యోగులుగా మారుతున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల లే ఆఫ్‌లు ప్రకటిస్తుండటంతో లక్షల వేతనం వచ్చే టెక్కీలు ఒక్కసారిగా నిరుద్యోగులుగా మారుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఎంత మంది నిరుద్యోగులు వస్తారో ఊహించుకోండి. అటువంటి పరిస్థితే కోల్‌కత్తాలో జరిగింది. దిగ్గజ టెక్‌ సంస్థ విప్రో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూల కోసం నోటిఫికేషన్‌ ఇవ్వగా వేలాది మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూ కోసం హాజరయ్యారు. ఉద్యోగాలు తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ 10వేల మందికంటే ఎక్కువ మంది తరలి వచ్చారు.

Read also: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్స్‌కు సర్కారు హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి..

గత కొంత కాలంగా కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ ప్రకటిస్తుండటంతో నిరుద్యోగులు పెరుగుతున్నారు. దీంతో ఉద్యోగార్థులు ఎక్కడ ఇంటర్వ్యూలు ఉన్నా.. భారీగా తరలి వస్తున్నారు. తాజాగా విప్రో కోల్ కతా క్యాంపస్ లో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వేలాది మంది తరలి వచ్చారు. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలతోపాటు.. కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ ప్రకటించాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న టెక్కీలు.. నిరుద్యోగులు ఏ సంస్థ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. బారులు తీరుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగర పరిధిలోని విప్రో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు తరలి వచ్చిన ఉద్యోగార్థులే ఉదాహరణ. కోల్‌కతా విప్రో క్యాంపస్ బయట వేలాది మంది ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్నారు. భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలైంది. ‘ఈ వీడియోలో కనిపిస్తున్న వారంతా కోల్ కతాలోని విప్రో క్యాంపస్ లో నిర్వహిస్తున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వచ్చిన వారే. తక్కువ ఉద్యోగాలకే విప్రో వాక్ఇన్ ఇంటర్వ్యూలను పిలిచినా దాదాపు 10 వేల మంది ఉద్యోగార్థులు తరలి వచ్చారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు సరైన ఉదాహరణ’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్ లో వీడియో షేర్ చేశాడు. దేశంలో జాబ్ మార్కెట్ ఎప్పుడూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. అమెరికాలో వడ్డీరేట్ల పెంపుతో ఆ దేశంతోపాటు భారత్‌లోనూ ఇలా నిరుద్యోగులు ఉన్నారని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఎల్లవేళలా వాక్ఇన్ ఇంటర్వ్యూలు అంత తేలిక్కాదు’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

Exit mobile version