MP High Court: భార్యభర్తల విధులు, ఇంట్లో పనుల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య సమయానికి వంట చేయకపోవడం, భర్తని ఇంటి పనులు చేయమనడం, బట్టలు ఉతకమనడం ఆత్మహత్యకు ప్రేరేపిత కారణాలు కావని, ఈ సమస్యలు సామాన్యమైనవని, అందరి ఇళ్లలో సాధారణమని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 306 కింద భార్యపై అభియోగాలు మోపిన సర్దార్‌పూర్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జ్ 2024 ఏప్రిల్ 3న జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ హిర్దేష్ అధ్యక్షత హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్(భార్య)పై చేసిన ఆరోపణలు సాధారణంగా అన్ని ఇళ్లలో జరుగుతాయని చెప్పింది.
కేసు వివరాలు:
సంగీతకు ఆమె భర్తతో ఏప్రిల్ 27, 2022లో వివాహ జరిగింది. ఈ జంటకు ఓ కుమార్తె కూడా ఉంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్-ధార్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భర్త ఆత్మహత్యకు ముందు సంగీత 6 నెలల పాటు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, భర్త కూలీ పని చేస్తుండే వారు. డిసెంబర్ 27, 2023న సంగీత భర్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన 21 రోజుల తర్వాత సంగీతపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
భార్య ఇంటి పనులు చేయమనడం, కుటుంబ వివాహానికి హాజరు కావాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలు వేధింపుల కిందకు రావని ఆమె తరుపున న్యాయవాది కోర్టులో వాదించారు. మృతుడు సూసైడ్ నోట్ రాయలేదని, మరణిస్తున్నందుకు కారణాలను డిక్లేర్ చేయలేదని అతని భార్యపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. ఇవన్నీ వైవాహిక విధుల కిందకు వస్తాయని, సెక్షన్ 306 ఐపీసీ (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కిందకు రాదని చెప్పారు.
అయితే, దీనికి విరుద్ధంగా మృతుడు, సంగీత వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్(స్టేట్) ఆరోపించింది. సంగీత ప్రవర్తన, ఆమె భర్తను ఇంటి పనులు చేయాలని ఒత్తిడి చేయడం, ఇతర గృహ సమస్యల కారణంగానే తీవ్ర మనోవేదనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ చర్యలు ఈ చర్యలు సెక్షన్ 306 IPC కింద అభియోగాన్ని సమర్థిస్తున్నాయని మరియు రివిజన్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.
అయితే, ఆత్మహత్యకు ప్రేరేపించే కారణాలను కోర్టు నిర్వచించింది. ఆత్మహత్యను ప్రేరేపించే ప్రమాణాలను స్పష్టం చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పుల్ని కోర్టు ప్రస్తావించింది. ‘చిత్రేష్ కుమార్ చోప్రా వర్సెస్ స్టేట్’ (2009) కేసులను హైకోర్టు హైలైట్ చేసింది. ‘ప్రవీణ్ ప్రధాన్ వర్సెస్ ఉత్తరాంచల్ రాష్ట్రం’ కేసులో ప్రేరేపనలకు సహేతుకమైన ఖచ్చితత్వ ఉండాలనే విషయాన్ని ప్రస్తావించింది. “సమయానికి ఆహారం సిద్ధం చేయకపోవడం, భర్తను శుభ్రపరచడంతో పాటు బట్టలు ఉతకడం, తన సొంత సోదరుడి వివాహంలో నృత్యం చేయడం, మరణించిన వ్యక్తిని వెంటనే వారి నివాస స్థలానికి తిరిగి వెళ్లమని బలవంతం చేయడం, షాపింగ్ కోసం ఇతర వ్యక్తులతో కలిసి మార్కెట్‌కి వెళ్లడం, ఆత్మహత్యకు ప్రోత్సహించాయని చెప్పలేము.’’ అని కోర్టు పేర్కొంది.