Temperature Rise: భారతీయ నగరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీ నగరంలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 కి చేరుకుంది. ఒక్క ఢిల్లీనే కాదు, బెంగళూర్, చెన్నై నగరాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగాయి. ముఖ్యంగా బెంగళూర్, ఢిల్లీ నగరాలు నీటి సంక్షోభంతో అల్లాడుతున్నాయి. సాధారణంగా భారతదేశంలో మెట్రోపాలిటన్ నగరాల్లో మే, జూన్, జూలైలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. దీనికి ‘‘ అర్బన్ హీట్-ఐలాండ్’’ అనే దృగ్విషయం కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే నగరానికి అనుకుని ఉండే గ్రామీణ ప్రాంతంలోని ఉష్ణోగ్రత కన్నా, నగరంలో అధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడాన్ని ‘‘అర్బన్ హీట్-ఐలాండ్’’ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా మానవుడు కార్యకలాపాలతో పాటు బిల్డింగ్స్, పట్టణ-నగర ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు ఉష్ణోగ్రతను ఎక్కువగా గ్రహించడం వల్ల ఏర్పడుతుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉండకపోవడంతో నగరాల కన్నా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రత ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇతర దేశాల్లో కూడా ఇలాగే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ఏడాది భారత్‌లో అధిక వేడికి ‘‘ఎల్ నినో’’ కూడా ఒక కారణం అని చెబుతున్నారు.
ఎల్ నినో అంటే ఏమిటి.?
‘‘ఎన్ నినో’’ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఒక వాతావరణ దృగ్విషయం. సాధారణంగా సముద్ర జలాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఎల్ నినో తీవ్రత అనేది సముద్ర జలాల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఏర్పడిన సమయాల్లో ఉపఖండంలో రుతుపవన వ్యవస్థ దెబ్బతింటుంది. అనుకున్న విధంగా వర్షాలు కురవవు. ఎల్ నినో చక్రం 2023లో ప్రారంభమైంది మరియు దీని ప్రభావం ఈ ఏడాది జూన్ వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇదే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతకు ఇది కూడా ఒక కారణం.
అయితే త్వరలోనే ఎల్ నినో బలహీనపడి ‘‘లా నినా’’ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. లా నినా వల్ల విస్తారంగా వర్షాలు కురస్తాయి. లా నినా అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటిని చల్లబరచడం. లా నినా అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశం ఈ సంవత్సరం మంచి రుతుపవనాలను చూసే అవకాశం ఉంది.
Read Also: Stock Market: వరుసగా ఐదో రోజూ నష్టాలే.. కారణమిదేనా?
వడగాలులకు కారణం ఇదే:
మన వాతావరణంతో పాటు మహా సముద్రాల్లో సంభవించే అనేక మార్పులు దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో వేడిగాలులకు దారి తీస్తున్నాయి.
డ్రై హీట్ స్ట్రెస్: ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పొడి వేడి ఒత్తిడి ఏర్పడుతుంది. కానీ తేమ తక్కువగా ఉంటుంది. ఈ తీవ్రమైన వేడిలో చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రత చల్లబడటం కష్టం అవుతుంది. ఇది డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తుంది.
మాయిస్ట్ హీట్ స్ట్రెస్: ఇది తేమ పెరిగి, ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో ఇది సంభవిస్తుంది. ఈ స్థితిలో చెమటలు పట్టడంతో, వేడి ఒత్తిడి పెరగడం వల్ల శరీరం తనను తాను చట్టబరచడంలో విఫలమవుతుంది. ఒడిశా, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
