Site icon NTV Telugu

Hit-and-Run law: కొత్త “హిట్ అండ్ రన్” చట్టంలో ఏముంది..? డ్రైవర్ల ఆందోళన ఎందుకు..? పాతచట్టం ఏం చెబుతుంది..?

Hit And Run Law,

Hit And Run Law,

Hit-and-Run law: కేంద్రం తీసుకువచ్చిన కొత్త ‘‘హిట్ అండ్ రన్’’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కులు, ట్యాంకర్లు, లారీలు, బస్సుల డ్రైవర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజల్ని పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టేలా చేసింది. సోమవారం నుంచి ట్రక్కర్లు ఆందోళన బాటపట్టారు.

అయితే ఈ చట్టంలో ఏముంది, అసలు ఎందుకు డ్రైవర్లు ఇంతలా భయపడుతున్నారు.?

కొత్త ‘‘హిట్ అండ్ రన్ చట్టం’’:

ఇటీవల బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో “భారత న్యాయ సంహిత” అనే కొత్త క్రిమినల్ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టంలో హిట్ అండ్ రన్‌కి పాల్పడే వ్యక్తులకు శిక్షల్ని కఠినతరం చేశారు.

కొత్త చట్టం ప్రకారం, నిర్లక్ష్యంగా రాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఒక వేళ వ్యక్తి మరణానికి కారణమై, ఈ సంఘటనను స్థానిక పోలీసులకు, మెజిస్ట్రేట్‌కి సమాచారం ఇవ్వకుండా పారిపోతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతే కాకుండా రూ.7లక్షల జరిమానా పడే అవకాశం ఉంది.

Read Also: Truckers Protest: ట్రక్ డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో కాసేపట్లో కేంద్రం కీలక భేటీ..

పాత చట్టం ఏం చెబుతోంది:

బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) హిట్ అండ్ రన్ కేసుల కోసం నిర్దిష్ట నిబంధనను కలిగి లేదు. ఇలాంటి కేసులు సెక్షన్ 304ఏ కిందకు వస్తాయి. ఒక వ్యక్తి నిర్లక్ష్యపు చర్యల వల్ల ఒకరి మరణానికి కారణమైతే గరిష్టంగా 2 ఏళ్లు జైలు శిక్ష జరిమానా విధించవచ్చు. జరిమానా విధించవచ్చు, విధించకపోచ్చు.

డ్రైవర్ల భయాలేంటి..?

కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్ష ఎక్కువ కాలం ఉండటంతో పాటు, జరిమానా భారీగా ఉండటంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల పాలిట దీన్ని నల్లచట్టంగా అభివర్ణిస్తున్నారు. ఒక వేళ శిక్ష పడితే పదేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉండటమే కాకుండా, తమ కుటుంబం నడిరోడ్డున పడుతుందని ఆందోళన చెందుతున్నారు. జరిమానాగా చెబుతున్న రూ. 7 లక్షల ఉంటే ఈ డ్రైవర్ వృ‌త్తిని ఎందుకు చేపడుతామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల కొత్తగా ఈ వృత్తిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. శిక్షతో పాటు జరిమానాను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Exit mobile version