NTV Telugu Site icon

MiG Crashes: వాయుసేనకు మిగ్‌-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!

Mig

Mig

ఒకటి కాదు.. రెండు కాదు.. వందల ప్రమాదాలు.. భారత వాయుసేనలో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న మిగ్-21 బైసన్ యుద్ధ విమానాల పరిస్థితి ఇది.. 60 ఏళ్లుగా అవి కూలిపోతూనే ఉన్నాయి.. వాయుసేనలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 ప్రమాదాలు జరిగాయంటే.. వాటి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. తాజాగా రాజస్థాన్‌లోని బార్మేర్ జిల్లాలో మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో… ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఏడాదిన్నర కాలంలోనే ఆరు మిగ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. మిగ్‌-21 ఫైటర్ జెట్‌ విమానాలు వరుసగా కూలిపోతుండటంతో…ఎగిరే శవపేటికలు, విడో మేకర్‌ అంటూ వీటికి పేర్లున్నాయి… ఈ విమానాల్లో ప్రయాణం చేస్తే.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న విమర్శలు ఉన్నాయి. వీటి పనితీరుపై ఎంతో కాలంగా రక్షణ రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగ్-21 ఫైటర్ జెట్లను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ రక్షణ శాఖ మాత్రం వాటిని కొనసాగిస్తూనే ఉంది. కాలం చెల్లిన మిగ్‌-21 విమానాలను… విరమించుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది.

Read Also: KTR: మున్సిపల్‌ అధికారి అత్యుత్సాహం.. కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

భారత వైమానిక దళానికి 42 స్వ్కాడ్రన్లు ఉండాలి. ప్రస్తుతం 32 స్వ్కాడ్రన్లే ఉన్నాయి. ఇందులో మిగ్‌-21 బైసన్‌కు నాలుగు స్క్వాడ్రన్‌ల ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్‌లో 16 నుంచి 18 ఫైటర్‌ జెట్‌ విమానాలు ఉంటాయి.. మిగ్‌-21 మోడల్‌లో బైసన్ సిరీస్‌ సరికొత్త వేరియంట్. దీన్ని సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ.. తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. గత 60 ఏళ్లలో ఏకంగా 400 మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో రెండు వందల మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది సాధారణ పౌరులు…ఈ ప్రమాదాలకు బలి కావాల్సి వచ్చింది. రష్యాలో తయారైన మిగ్‌-21 విమానాలను… 1963లో మొదటిసారి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌ను రక్షణ శాఖ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రష్యా నుంచి టెక్నాలజీని కొనుగోలు చేసింది ఇండియా. ఆ తర్వాత 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ పొందింది. అనంతరం విమానాల ఉత్పత్తిని ప్రారంభించింది. రష్యా 1985లో మిగ్ విమానాల తయారీని నిలిపివేసింది. భారత వాయుసేన మాత్రం సెన్సార్లు, వెపన్స్‌… అప్‌గ్రేడ్ చేసి ఉపయోగిస్తోంది.

పాకిస్తాన్‌తో 1971, 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మిగ్‌-21 విమానాలే కీలక పాత్ర పోషించాయి. 2019లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ కూడా… మిగ్‌-21 విమానం ప్రమాదంలోనే పాకిస్తాన్‌ భూభాగంలో పడిపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌-16 ఫైటర్‌ను కూల్చేసిన తర్వాత.. అభినందన్‌ విమానం కూలిపోయింది. ఆ తర్వాతే భారత సైన్యం బాలాకోట్‌పై దాడులకు పాల్పడింది. మిగ్‌-21 ప్రమాదాలు పెరగడంతో…తేజాస్ ఫైటర్‌పై వాయుసేన దృష్టి సారించింది. భారత వైమానిక దళం… సెప్టెంబర్ చివరి నాటికి మిగ్‌-21 విమానాల సేవలను నిలిపివేయాలని భావిస్తోంది. దీంతో మిగ్‌ 21 బైసన్ స్క్వాడ్రన్‌లో మూడు మాత్రమే మిగిలి ఉంటాయి. 2024-25 నాటికి…మిగ్‌-21 విమానాలను పక్కన పెట్టేందుకు సైన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇక, గురువారం జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అదిత్య భల్‌ ప్రాణాలు కోల్పోయారు. వింగ్ కమాండర్ ఎం. రానా స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆదిత్య బల్ స్వస్థలం జమ్ము. రోజూవారీ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన సమయంలో.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తర్వాత నియంత్రణ కోల్పోయి పంట పొలాల్లో కుప్పకూలిపోయింది. పైలట్లు ఎజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోవడంతో.. ఇద్దరు స్పాట్‌లో మరణించారు. అయితే, ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ… కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. బాడ్మేర్‌లో జరిగిన ప్రమాదంతో దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మిగ్‌-21 విమాన ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆయన… ఈ మోడల్‌ విమానాల వల్ల ఇప్పటి వరకూ 200 మంది పైలట్ల ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇంకెప్పుడు ఎగిరే శవపేటికను వైమానిక దళం నుంచి పక్కనపెడతారంటూ ప్రశ్నించారు. మన పిల్లలు ఈ విమానాలు నడిపేందుకు అనుమతిస్తామా అన్న వరుణ్ గాంధీ…. ఈ దేశ పార్లమెంట్‌ సభ్యులు ఆలోచించుకోవాలని అన్నారు. మొత్తంగా మిగ్-21 సేవలపై భారత వాయు సేన కీలక నిర్ణయమే తీసుకుంది.. 2025 నాటికి మిగ్-21 సేవలకు విశ్రాంతి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.. వరుస ప్రమాదాలు, పైలట్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.