NTV Telugu Site icon

Swati Maliwal Case: స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రుల్ని ప్రశ్నించనున్న పోలీసులు..ఎందుకంటే..?

Swati Maliwal Case

Swati Maliwal Case

Swati Maliwal Case: రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే దాడి జరిగింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేశారు. ఈ దాడి కేసులో ఇప్పటికే బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం నివాసంలో ఆమెపై దాడి జరిగిన రూంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని, బిభవ్ కుమార్ మొబైల్ ఫోన్‌ని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రుల్ని పోలీసులు విచారించనున్నారు. ‘‘రేపు ఢిల్లీ పోలీసులు నా వృద్ధులైన, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల్ని విచారించేందుకు వస్తారు’’ అని కేజ్రీవాల్ స్వయంగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Read Also: OPPO Reno 12: మార్కెట్ లోకి వచ్చేస్తున్న Reno 12 సిరీస్.. వివరాలు ఇలా..

మే 13న కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలివాల్ వెళ్లిన సమయంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు అల్పాహారం తీసుకుంటున్నారని మలివాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రాయింగ్ రూమ్‌లోకి వెళ్లేముందు తాను వారిని పలకరించినట్లు మలివాల్ చెప్పారు. ఆ తర్వాత కేజ్రీవాల్ పీఏ డ్రాయింగ్ రూంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తన ఛాతీ, పొట్ట, చెంపపై కొట్టాడని ఆమె బిభవ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే ఈ రోజు తొలిసారిగా మలివాల్‌పై దాడి గురించి కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్లు ఉన్నాయని, పోలీసులు న్యాయబద్ధంగా విచారించి, న్యాయం చేయాలని ఆయన అన్నారు. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్వాతి మలివాల్ స్పందించారు. తన క్యారెక్టర్‌ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన వ్యక్తి న్యాయమైన విచారణకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మలివాల్ అన్నారు. ఆప్ నేతలు, వాలంటీర్ల సైన్యాన్ని నాపైకి ఉసిగొలిపి నన్ను బీజేపీ ఎజెంట్ అని పిలిచి, నా క్యారెక్టర్‌ని హత్య చేశారని, ఎడిట్ చేసిన వీడియోలను లీక్ చేసి, నిందితుడితో కలిసి తిరిగాడని కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. నేను ఎవరి డ్రాయంగ్ రూంలో దాడికి గురయ్యానో, ముఖ్యమంత్రి చివరకు ఈ విషయంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నారని మలివాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Show comments