Presidential Poll 2022: దేశంలో భారత 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది. ముర్ము విజయం ఖాయమైనా.. యశ్వంత్ సిన్హా గట్టి పోటీ అవకాశం ఉంది.
పార్లమెంట్, అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండడంతో వారి బ్యాలెట్లను గుర్తించేందుకు ఆకుపచ్చ, గులాబీ రంగులు గల బ్యాలెట్లను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఓటు వేశారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. లక్నోలో యూపీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులంతా ఎన్నికల సిబ్బంది ఇచ్చే ప్రత్యేక పెన్నుతోనే ఓటు వేయాలి. బ్యాలెట్ పత్రం ఆధారంగా జరిగే ఈ ఎన్నికలో వరుస క్రమంలో ద్రౌపదీ ముర్ము, యశ్వంత్ సిన్హా పేర్లు ఉండనున్నాయి. ఓటర్లు తాము ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పక్కన ప్రాధాన్య సంఖ్యను అంకెల రూపంలో వేయాల్సి ఉంటుంది.
Presidential Poll 2022 Live Updates : ఎప్పటికప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమగ్ర సమాచారం
ఎన్డీఏకు ఉన్న మద్దతు ప్రకారం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము గెలుపు దాదాపు ఖాయమే. భాజపా, ఎన్డీయే కూటమి పక్షాలతోపాటు, బీజేడీ, వైకాపా, బీఎస్‌పీ, ఏఐఏడీఎంకె, జేడీఎస్, తెదేపా, అకాలీదళ్, శివసేన, జేఎంఎం పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు 60శాతానికి పైగా ఓట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 21న ఫలితం ప్రకటించిన తర్వాత దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తొలి గిరిజన మహిళగా ద్రౌపదీ ముర్ము చరిత్రకెక్కనున్నారు. ప్రస్తుతం నికరంగా 10.81 లక్షల ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే అభ్యర్థికి 6.66 లక్షల ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022