Ravindra Kaushik: ఒక వ్యక్తి మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశానికి భయం అంటే ఏంటో చూపించాడు. వారి ఆర్మీలోనే ఉంటూ, భారతదేశానికి పనిచేసిన గొప్ప వ్యక్తి, ‘‘బ్లాక్ టైగర్’’గా కొనియాడబడిన రవీంద్ర కౌశిక్ ధైర్యం, తెగువ చాలా మందికి ఆదర్శం. భారత గూఢచారిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ, నిఘా ఏజెన్సీలకు గర్వకారణం. అయితే, ఎప్పటికైనా ఒక గూఢచారిని కలవరపెట్టే అంశం, తన ముసుగు తొలిగిపోవడం. రవీంద్ర కౌశిక్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది.
ఎవరు ఈ రవీంద్ర కౌశిక్..?
రాజస్థాన్ శ్రీగంగా నగర్‌కు చెందిర రవీంద్ర కౌశిక్ చిన్న వయసులోనే భారతదేశపు ప్రధాన గూఢచారి సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో నియమించబడ్డాడు. 1970లలో భారత నిఘా ఏజెన్సీ పాకిస్తాన్‌లో నిఘా ఏజెంట్లను నియమించే పనిలో పడింది. అలాంటి సమయంలోనే రవీంద్రతో పాటు కొంత మంది యువకులను, మహిళల్ని నియమించుకుంది. వారికి శిక్షణ ఇచ్చి పాకిస్తాన్ దేశంలోకి చొరబడేలా చేసింది.
పాకిస్తాన్‌లోకి ఎంట్రీ..
రవీంద్ర కౌశిక్, పూర్తిగా పాకిస్తాన్ వ్యక్తిగా మారేందుకు, ఆ దేశానికి చెందిన పూర్తి వివరాలను ముందుగానే నేర్పించారు. అక్కడి వారు మాట్లాడే భాష, ఆచార వ్యవహారాలను నేర్పించారు. ఇస్లామిక్ సిద్ధాంతాలు, మతానికి సంబంధించిన వివరాలను చెప్పారు. అన్ని నేర్చుకున్నాక, రవీంద్ర కొత్త పేరు నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో జీవించడం మొదలుపెట్టారు. దీనికి ముందు, భారత్‌లో అతడి ఐడెంటిటీని పూర్తిగా చెరిపేశారు. నటనపై, రంగస్థల ప్రదర్శనపై పూర్తి పట్టు ఉన్న రవీంద్ర కౌశిక్, భారత నిఘా ఏజెన్సీకి ప్రధాన ఆస్తిగా మారారు.
పాక్ లోకి వచ్చిన తర్వాత కరాచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో చేరారు. అక్కడే అతడి సీనియర్లు, ఇతర సహచరులు నమ్మకాన్ని చూరగొన్నారు. పాకిస్తాన్ సైన్యంలో క్రమంగా ఎదిగారు. పాక్ మహిళను పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తండ్రిగా మారారు. కుటుంబ బంధాల్లో చిక్కుకున్నప్పటికీ, మాతృదేశ సేవను ఎప్పుడూ మరవలేదు. పాకిస్తాన్ కీలక సమచారాన్ని భారత్‌కి పంపడం మొదలుపెట్టారు.
పాకిస్తాన్‌కు పట్టుబడిన రవీంద్ర కౌశిక్:
ఏళ్లకు ఏళ్లుగా పాకిస్తాన్ ఆర్మీ మూమెంట్స్, వారి ప్లాన్స్ ఎప్పటికప్పుడు రవీంద్ర భారత్‌కి చేరవేస్తుండే వారు. కానీ, 1983లో రవీంద్ర నుంచి భారత్‌కు ఎలాంటి సమాచారం రాకపోవడంతో, ‘‘రా’’ కలవరపడింది. ఆయన స్థితిని తెలుసుకునేందుకు మరొక ఏజెంట్‌ను పంపించింది. రవీంద్రను కలవాలని చెప్పింది. అయితే, పాక్ నిఘా ఏజెన్సీలు రా పంపిన ఏజెంట్‌ను పట్టుకున్నాయి. దీంతో ‘‘బ్లాక్ టైగర్’’ ముసుగు తొలిగిపోయింది. రవీంద్ర కౌశిక్‌ను పాకిస్తాన్ దళాలు పట్టుకుని, కోర్టు మార్షల్ చేసి, మరణశిక్ష విధించాయి. ఇలా ఒక గొప్ప గూఢచారి జీవితం అంతమైంది.
