K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రదానం
  • కె. పజనివేల్ కు పద్మశ్రీ పురస్కారం ప్రదానం
  • ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం
K Pajanivel

K Pajanivel

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఘన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 5,000 ఏళ్ల పురాతన యుద్ధ కళ ‘శిలంబం’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కె. పజనివేల్ కు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించే ముందు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి సాష్టాంగ నమస్కారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శిలంబానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన కె. పజనివేల్

పుదుచ్చేరిలోని పురనన్‌కుప్పం గ్రామానికి చెందిన 53 ఏళ్ల కె. పజనివేల్ చిన్నతనం నుంచే యుద్ధ కళలపై ఆసక్తి పెంచుకున్నారు. స్థానిక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమిళనాడు సంప్రదాయ యుద్ధ కళ అయిన శిలంబంతో పరిచయం ఏర్పడి, అనంతరం జీవితాన్నే దానికి అంకితం చేశారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన 13 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో ఏడో తరగతి తర్వాత చదువు మానేసి బస్సు క్లీనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఒక్కో బస్సుకు కేవలం రూ.3 మాత్రమే సంపాదించేవారు. తరువాత బస్సు డ్రైవర్‌గా మారినా, శిలంబం సాధనను మాత్రం ఆపలేదు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు

కె. పజనివేల్ 2002లో తిరుచిరాపల్లిలో జరిగిన అంతర్జాతీయ శిలంబం పోటీల్లో 56-60 కేజీల విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. 2004లో నాగర్‌కోయిల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజేతగా నిలిచారు. శిలంబంతో పాటు కూతు వారిసై, కలరి పట్టు, ఫెన్సింగ్, పులియట్టం, కలియట్టం వంటి పలు దక్షిణ భారతీయ యుద్ధ కళల్లో కూడా ఆయన ప్రావీణ్యం సంపాదించారు.

ప్రపంచవ్యాప్తంగా శిలంబం ప్రచారం

ఒక దశలో బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా శిలంబం అభివృద్ధికే తన జీవితాన్ని అంకితం చేశారు. భారత్‌తో పాటు దుబాయ్, పారిస్ వంటి నగరాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఈ ప్రాచీన కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. 2022లో పుదుచ్చేరిలో “మామల్లన్ శిలంబం అండ్ ఫోక్ ఆర్ట్స్ డెవలప్‌మెంట్ క్లబ్”ను స్థాపించి వేలాది మంది యువతకు శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటివరకు 5,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో యూరప్, బ్రెజిల్ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.

పాఠశాల విద్యార్థుల కోసం ఆయన ఉచిత వేసవి శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. భారత జానపద యుద్ధ కళలకు చేసిన సేవలకు గాను 2023లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

2026కు 131 పద్మ పురస్కారాలు

2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్‌లు, 13 పద్మ భూషణ్‌లు, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.

ఈ ఏడాది ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రదానం చేయగా, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎన్. రాజంకు కూడా పద్మ విభూషణ్ లభించింది.

అదేవిధంగా ఉదయ్ కోటక్, పీయూష్ పాండే, హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రోసెంజిత్ ఛటర్జీ తదితర ప్రముఖులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించబడ్డారు.