Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..

Dharmendra Pradhan Resign

Dharmendra Pradhan Resign

Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. యువత భవిష్యత్తు కేసుల్లో చిక్కుకోవద్దని, హింసకు పాల్పడొద్దనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను బాధ్యతల నుంచి ఎప్పుడూ పారిపోలేదని చెబుతూనే, తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి, మంత్రి వర్గ సభ్యులకు థాంక్స్ చెప్పారు. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలోకి రావొద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్ర మంత్రి వరకు..

ధర్మేంద్ర ప్రధాన్ దేశంలోని సీనియర్ బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో ఆయన పెట్రోలియం మరియు సహజవాయువు, ఉక్కు మంత్విత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒడిశా రాజకీయాల నుంచి వచ్చిన ప్రధాన్, ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు.

ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ మాజీ కేంద్ర మంత్రి. వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రాథమిక విద్యను ఒడిశాలోనే పూర్తిచేశారు. ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో ఎంఏ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. దీని తర్వాత భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో వివిధ పదవులు నిర్వహిస్తూ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

2000లో తొలిసారి ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 2004లో లోక్‌సభ సభ్యుడిగా గెలిచి, పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒడిశాలోని సంబల్‌పూర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తు్న్నారు.

కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ పలు కీలక శాఖలకు నాయకత్వం వహించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు, ఉక్కు, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖల్లో మంత్రిగా పనిచేశారు. జూలై 2021లో కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు చేపట్టి సుమారు ఐదేళ్లపాటు ఆ శాఖను నిర్వహించారు.

మొత్తం ఆస్తులు రూ. 6.92 కోట్లు..

ధర్మేంద్ర ప్రధాన్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తన ఆస్తులను ఎన్నికల సంఘానికి వెల్లడించారు. ఆ సమయంలో దాఖలు చేసిన అధికారిక అఫిడవిట్ ప్రకారం.. ఆయన, ఆయన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 6.92 కోట్లు. రూ.2.30 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్‌లలో రూ. 2.47 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 80.40 లక్షలు, జీవిత బీమా పాలసీల్లో రూ. 67.72 లక్షల పెట్టుబడులు ఉన్నాయి.