Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?

  • అస్సాం రాజకీయాల్లో సంచలనంగా దేవాశిష్ శర్మ..
  • ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి..
  • 8 రోజుల్లోనే ఎంపీ ఉప ఎన్నికల టికెట్..
Devasish Sharma

Devasish Sharma

Devasish Sharma: జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన వ్యక్తి, ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నారు. గిటార్ వాయిస్తూ, పాటలు పడే ఆ ఐఏఎస్ అధికారి, క్యాన్సర్ బాధితుల కోసం సామాజిక కార్యకర్తగా మారిన అధికారి ఇప్పుడు బీజేపీ తరుఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనే దేవాశిష్ శర్మ. అస్సాం రాష్ట్రంలోని నాగావ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన దేవాశిష్ శర్మ, సెప్టెంబర్ 3న ప్రభుత్వం సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. సెప్టెంబర్ 8న ఆయన బీజేపీలో చేరారు. సెప్టెంబర్ 11న లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పార్టీ ఆయన పేరును ప్రకటించింది.

ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన 8 రోజుల్లోనే ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇది అస్సాం రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. నాగావ్ లోక్‌సభ స్థానానికి అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.నాగావ్ నుంచి 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున విజయం సాధించిన ప్రద్యుత్ బోర్డోలోయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆయన డిస్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. దీంతో ఆయన రాజీనామా చేసిన నాగావ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు ఖరారయ్యాయి.

కాంగ్రెస్ విమర్శలు.. బీజేపీ వాదన ఏంటంటే.?

దేవాశిష్ శర్మ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. నాగావ్ జిల్లా కమిషనర్‌గా, జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసిన తర్వాత అదే ప్రాంతం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తోంది. అస్సాం అధ్యక్షుడు జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఆయనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యం ఉంటే నాగావ్ జిల్లా ఎన్నికల అధికారిగా ఎందుకు పనిచేశారని ప్రశ్నించారు. అయితే, బీజేపీ దేవాశిష్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ అధికారికంగా ఆమోదించిన తర్వాతే ఆయన రాజకీయ పార్టీలో చేరినట్లు చెప్పింది. దీంట్లో ఎలాంటి తప్పు లేదని వాదించింది.