NTV Telugu Site icon

Kolkata Doctor Case: ఇంత అర్జెంట్ ఎందుకు..? ఆర్జీ కర్ ఆస్పత్రి పనులపై హైకోర్టు ప్రశ్న..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలోని భాగాలను పునరుద్ధరించాల్సిన అత్యవసరం ఏమిటి..? అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం ఈ అంశాన్ని హైకోర్టు విచారించింది. నేరం జరిగిన ప్రదేశం నుంచి సాక్ష్యాలు నాశనం చేయడానికి ఆస్పత్రిలో అత్యవసరంగా సెమినార్ హాలు చుట్టూ కూల్చివేత పనులు జరిగాయనే ఆరోపణలపై సమాధానం చెప్పాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Read Also: Rajanna Sirisilla District: బాబాయ్ ని ఇరికించేందుకు అబ్బాయి కిడ్నాప్ డ్రామా.. అవాక్కైన పోలీసులు

అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. వైద్యుల కోసం వాష్‌రూములను నిర్మించడానికి పనులు చేపడుతున్నట్లు చెప్పాడు. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రదేశం సంఘటన స్థలానికి దగ్గర్లో లేదని, దీనిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పారు. అయితే, చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో పనులు చేయడాన్ని ప్రశ్నించారు. ‘‘ అత్యవసరంగా 12 గంటల్లో రెస్ట్ రూములను అందించడం అంత ముఖ్యమా..? మీరు ఏదైనా జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెళ్లండి. మహిళలకు రెస్ట్ రూములు ఉన్నాయో లేదో చూడండి. నేను బాధ్యతతో చెబుతున్నాను, పీడబ్ల్యూడీ ఏం చేస్తుంది..? కోర్టు సముదాయాలల్లో అక్కడ విశ్రాంతి గదుల పరిస్థితిని చూడండి’’ అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు.

కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఆస్పత్రిలోకి చొరబడి కొందరు దుండగులు దాడి చేయడంపై కూడా పోలీసుల తీరును ప్రశ్నించింది. బాధితురాలికి మద్దతుగా బుధవారం పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన సమయంలో ఈ దాడి జరిగింది. 7000 మంది ప్రజలు గుమిగూడే విషయం పోలీసులకు తెలియకపోవడం పూర్తిగా వైఫల్యమే అని కోర్టు వ్యాక్యానించింది. నేరం జరిగిన ప్రదేశం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించేందుకు ఫొటోలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Show comments