NTV Telugu Site icon

Tamilnadu CM: మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?

Stalin

Stalin

Tamilnadu CM: కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ఫైర్‌ అయ్యారు. తాము ఒకటి అడిగితే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మరొకటి చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు. తాము అడిగిన విషయాలను చెప్పకుండా వాటిని దాటవేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిదేళ్లపాలనలో రాష్ట్రానికి ప్రకటించిన పథకాల జాబితా చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అడిగితే .. అవి చెప్పకుండా కేంద్రం రాష్ట్రానికి అందించిన నిధుల జాబితాను ప్రకటించి వెళ్ళిపోయారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విమర్శించారు.

Read also: Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్నీ జరిగేది ఇక అక్కడేనా..?

మూడు రోజుల క్రితం సేలంలో జరిగిన డీఎంకే సభలో స్టాలిన్‌ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన పథకాల జాబితాను వెల్లడించాలని కేంద్ర మంత్రి అమిత్‌ షాను ప్రశ్నించారు. అందుకు స్పందించి కేంద్రమంత్రి అమిత్‌షా పథకాల గురించి వివరిస్తారని అనుకుంటే కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలను ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం ఉదయం సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి కావేరి డెల్టా జిల్లాలకు సాగుజలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన పథకాల వివరాలను ప్రకటించి, ఎన్డీయే ప్రభుత్వం రాష్ర్టానికి ఇచ్చిన పథకాలేంటో చెప్పాలని తాను డిమాండ్‌ చేస్తే, ఆయన వేలూరు(Vellore) సభలో నిధుల వివరాలను ఏకరువు పెట్టి వెళ్ళిపోయారన్నారని విమర్శించారు.

Read also: Shocking incident: సెల్ఫీ కోసం తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టిన భార్య

సేలం సభలో తాను చెప్పిన వివరాలను అమిత్‌షా చదవలేదా? లేక బీజేపీ స్థానిక నాయకులు ఆ వివరాలను ఆయనకు అనువదించి చెప్పలేదా? అని స్టాలిన్‌ ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మెట్రోరైలు పథకం, తమిళ భాషకు ప్రాచీన హోదా, ప్రాచీన తమిళ పరిశోధన కేంద్రం ఏర్పాటు, సేతు సముద్రం ప్రాజెక్టుకు శ్రీకారం, ఒరగడంలో మోటరు వాహనాల పరిశోధన కేంద్రం, తాంబరంలో జాతీయ సిద్దవైద్య పరిశోధన కేంద్రం, సేలంలో కొత్తగా రైల్వే జోన్‌ ఏర్పాటు, హార్బర్‌ – మధురవాయల్‌ వంతెనలతో కూడిన రహదారి ప్రాజెక్టు, నెమ్మెలిలో నిర్లవణీకరణ ప్లాంట్‌, హొగేకల్‌ సమగ్రనీటి సరఫరా పథకం, చెన్నై సమీపంలో మారిటైమ్‌ యూనివర్శిటీ, కరూరు, ఈరోడ్‌, సేలం నగరాలలో జౌళి పార్కుల ఏర్పాటు వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని స్టాలిన్‌ వివరించారు. యూపీఏ ప్రభుత్వంలా ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రయోజనకరమైన పథకాలను అమలు చేసిందా అన్న ప్రశ్నకు అమిత్‌షా నుంచి సమాధానమే లేకపోయిందన్నారు. రాష్ట్రాలకు ఆదాయ వనరులను తగ్గించే విధంగా ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసి పన్నుల రూపంలో వసూలైన నిధులను రాబట్టుకుని అందులో కొంత శాతాన్ని మాత్రమే నిధుల పేరిట రాష్ర్టాలకు కేటాయిస్తోందన్న వాస్తవం అందరికీ తెలుసని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Read also: Maharashtra: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ

వైద్య రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందజంలో ఉన్న రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదన్నారు సీఎ స్టాలిన్‌. కానీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పలకు పోయి మదురైలో రూ.1200 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మిస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ ఆస్పత్రి ప్రాథమిక స్థాయి నిర్మాణ పనులు కూడా జరగలేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్రమంత్రులు కొందరు అదే పనిగా ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకాలనే డీఎంకే ప్రభుత్వం పేర్లు మార్చి తమవిగా గొప్పలు చెప్పుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని స్టాలిన్‌ తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మా క్యాంటీన్లు మూతపడతాయని ఫళనిస్వామీ ఆరోపించారని కానీ ప్రస్తుతం ఆ క్యాంటీన్లు అదే పేరుతో సమర్థవంతంగా నడుపుతున్నామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై మెకెదాటు వద్ద కొత్త ఆనకట్ట నిర్మించే ప్రయత్నాలను న్యాయపోరాటం జరిపి అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు.

Show comments