Site icon NTV Telugu

National Green Tribunal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి షాక్.. రూ.3,500 కోట్ల జరిమానా

National Green Tribunal

National Green Tribunal

National Green Tribunal: తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం వంటి నిర్వహణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు నెలల్లో రూ.3500 కోట్లు జరిమానా చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. గడువు దాటితే అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాలపై రూ.12,818.99 కోట్లు కేటాయించినప్పటికీ మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది.

Read Also: Jammu Kashmir: ఉగ్రవాదులకు, పాక్ ఇంటెలిజెన్స్‌కు భారత ఆర్మీ సమాచారం.. ఒకరి అరెస్ట్

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో రోజుకు 2,758 మిలియన్ లీటర్ల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. కేవలం 1,268 మిలియన్ లీటర్లకు మాత్రమే నిర్వహణ చేపడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. నిధులు లేవన్న సాకుతో చెత్త నిర్వహణను తప్పించుకోవడం సరికాదని తెలిపింది. ప్రజల దీర్ఘకాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వారి అనారోగ్య సమస్యలను వాయిదా వేయలేమని.. ప్రజలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం రాష్ట్రం, స్థానిక సంస్థల రాజ్యాంగ బాధ్యత అని ఎన్జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలను ఆలస్యం చేయరాదని ఎన్జీటీ సూచించింది. ఇప్పటికైనా చెత్త నిర్వహణపై బెంగాల్ సత్వర చర్యలు చేపట్టాలని.. ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Exit mobile version