Lok Sabha Elections 2024: ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నట్లు ఈసీ వెల్లడించింది. దాదాపుగా 82 రోజుల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది.
స్వతంత్ర భారతదేశంలో 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 2024లో జరగబోతున్న పార్లమెంటరీ ఎన్నికలే సుదీర్ఘకాలం పాటు జరగబోతున్నాయి. ఎన్నికల పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఫలితాల వెల్లడి వరకు 44 రోజులు ఉన్నాయి. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఓట్ల లెక్కింపు వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియ 82 రోజులు ఉంది.
Read Also: CM Revanth: తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..
భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ సెలవులు, పండగలు, పరీక్షలు ఇలా పలు అంశాల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం అన్నారు. ఇంత సుదీర్ఘ ప్రక్రియ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేయదా.? అని మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో.. దేశ భౌగోళిక పరిస్థితులు, నదులు, పర్వతాలు, మంచు, అడవులు, వేసవి, భద్రతా బలగాల తరలింపు ఇలా పలు కారణాలు ఎన్నికల నిర్వహణ సమయాన్ని నిర్దేశిస్తాయని చెప్పారు. మేము ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, ఇలా ఎవరైన సందేహిస్తే అది తప్పుడు భావన అని రాజీవ్ కుమార్ అన్నారు.
దేవంలో మొదటి సాధారణ ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 మధ్య జరిగాయి. ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ఎన్నికలు. 1962-1989 మధ్య లోక్ సభ ఎన్నికల వ్యవధి 4 రోజుల నుంచి 10 రోజుల మధ్య ఉంది. 1980లో జనవరి 3 నుంచి జనవరి 6 వరకు ఎన్నికల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చారు. 2004లో నాలుగు దశల్లో ఎన్నికలకు 21 రోజుల పట్టింది. 2009లో 5 దశల ఎన్నికలకు ఒక నెల పాటు కొనసాగాయి. 2014లో 9 దశల్లో ఎన్నికల నిర్వహణకు 36 రోజులు పట్టాయి. 2019లో 7 దశల్లో 39 రోజుల్లో ఎన్నికలు నిర్వహించారు.