హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు భావిస్తున్నారు.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ ముగిసింది. అక్కడ కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. ఇక జమ్మూకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా తలపడ్డాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అధికారం ఛేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేసింది. ఇక ఆప్ కూడా కొన్ని స్థానాలు దక్కించుకోవాలని ఆశలు పెట్టుకుంది. కానీ హర్యానా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారో వచ్చే మంగళవారం తేలిపోనుంది.