Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన తర్వాత, రష్యా-భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ నేపథ్యంతో పుతిన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also: DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక.. పెరుగనున్న డీఏ..
ఆగస్టుల నెలలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా, మొదటి సారిగా పుతిన్ పర్యటన గురించి ప్రకటించారు. అయితే, ఆ సమయంలో పర్యటన తేదీలు ఖరారు కాలేదు. ఇటీవల చైనా వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, పుతిన్ ఇద్దరు గంటకు పైగా సంభాషించారు.
ప్రస్తుతం, వాణిజ్య యుద్ధంలో భాగంగా, రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నామనే ఆరోపణలతో అమెరికా భారత్‌పై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ చర్య సహకరిస్తుందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే, తమ పౌరుల ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నామని, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటామని ఇండియా స్పష్టం చేసింది.
