తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు దివంగత సీఎం జయలలిత (అమ్మ) ఇష్టసఖి శశికళ (చిన్నమ్మ).. దానికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.. అదే రోజు పొలిటికల్ రీ ఎంట్రీకి శశికళ రంగం సిద్ధం చేసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది.. ఆ రోజు మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధిని సందర్శించేందుకు పోలీసు భద్రత కావాలని శశికళ అనుచరులు కోరారట.. దీంతో.. అమ్మ సమాధి దగ్గర నివాళులర్పించి.. అక్కడే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చినమ్మ ప్రకటన చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అయితే, శశికళకు ఎవరు మద్దతు ఇస్తున్నారనేదానిపై అన్నా డీఎంకేలో తీవ్ర చర్చ మొదలైందట.. మళ్లీ శశికళ వస్తే పరిస్థితి ఏంటి? అనే గుబులు కూడా ప్రత్యర్థుల్లో నెలకొన్నట్టుగా తెలుస్తోంది.
ఈ నెల 17 నాటికి అన్నాడీఎంకే పార్టీ 50 వసంతాలు పూర్తిచేసుకోనుంది.. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలకు రెడీ అవుతున్నారు.. అయితే, ఈ సమయాన్నే శశికళ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారట.. అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.. అమ్మ సమాధి దగ్గర నుంచి కొత్త రాజకీయాలకు స్వీకారం చుడతారని.. అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తారని తెలుస్తోంది.. ఇప్పటికే జిల్లాల్లో అన్నాడీఎంకే నేతలకు ఫోన్లు కూడా వెళ్లాయని.. పర్యటనలకు సిద్ధం కావాలని సూచించినట్టు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీతో పొత్తుపెట్టుకున్నా.. అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసింది… డీఎంకే ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు దివంగత నేత కరుణానిధి కుమారుడు స్టాలిన్.. క్రమంగా పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు.. మరోవైపు.. అన్నా డీఎంకేలో అభిప్రాయబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి.. ఈ తరుణంలో శశికళ ఎంట్రీ ప్రాధాన్యత సంతరించుకుంది.
