Virat Kohli Fan Killed Rohit Sharma Fan In Tamilnadu: వాళ్లిద్దరు ప్రాణ స్నేహితులు.. ఏదైనా సమస్య వస్తే, ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటారు. అలాంటి స్నేహితుల మధ్య ‘క్రికెట్ అభిమానం’ చిచ్చు రేపింది. ఇద్దరిని కొట్టుకునేలా చేసింది. ఒకరి ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన వివరాల్లోకి వెళ్తే.. విఘ్నేష్, ధర్మరాజ్ అనే యువకులు ప్రాణ స్నేహితులు. వీళ్లిద్దరు అరియలూర్ జిల్లా పొయ్యూరులో ఉంటారు. వీరిలో విఘ్నేష్ ఐఐటీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. జాబ్ వీసా కోసం మాత్రమే ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. వీళ్లిద్దరు కలిసి నిన్న (14-10-22) సాయంత్రం సరదాగా మద్యం తాగారు.
మొదట్లో జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు. కానీ, ఆ తర్వాత క్రికెట్ విషయమై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ ఇద్దరిలో విఘ్నేష్ రోహిత్ శర్మ అభిమాని అయితే.. ధర్మరాజ్ విరాట్ కోహ్లీ అభిమాని. తాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య వచ్చే ఐపీఎల్ టోర్నమెంట్ ప్రస్తావన వచ్చింది. ఈసారి ఆర్సీబీ తప్పకుండా గెలుస్తుందని ధర్మరాజ్ అంటే, లేదు మళ్లీ ముంబైనే గెలుస్తుందని విఘ్నేష్ అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్సీబీ ఇంతవరకూ ఒక్క కప్ కొట్టలేదని ఒకరంటే, రోహిత్ శర్మ ఎందుకు పనికిరాడంటూ ధర్మరాజ్ హేళన చేశాడు. దీంతో కోపాద్రిక్తుడైన విఘ్నేష్.. అతనిపై దాడి చేశాడు. అప్పుడు బ్యాట్‌తో ధర్మరాజ్ గట్టిగా బాదడంతో.. విఘ్నేష్ స్పాట్‌లో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ధర్మరాజ్‌ని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆర్సీబీ అభిమానులు, మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అతి చేస్తుంటారని.. తమిళనాడులో జరిగిన ఆ ఘటనే ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనలో కోహ్లీ తప్పు ఉందని, అతడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎవరో గొడవ పడి కొట్టుకుంటే, అందులో కోహ్లీ తప్పేముందంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా.. అభిమానం అనేది ఓ హద్దు వరకే ఉండాలి. మరీ ప్రాణాలు తీసుకునేదాకా రాకూడదు.
