Site icon NTV Telugu

Vikram 3201: భారత తొలి ‘‘మైక్రోప్రాసెసర్’’ ఆవిష్కరణ, “విక్రమ్ 3201” ప్రత్యేకతలు ఇవే..

Vikram 3201

Vikram 3201

Vikram 3201: భారత్ పూర్తిగా స్వదేశీ అయిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘‘విక్రమ్’’ను ఆవిష్కరించింది. ప్రస్తుత డిజిటల్ యుగంతో మైక్రోప్రాసెసర్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రతీ రంగంలో ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ రంగంలోకి భారత్ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశం నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రధాని మోడీ ఈ మైక్రోచిప్‌ని మంగళవారం ఆవిష్కరించారు. వీటిని ‘‘డిజిటర్ వజ్రాలు’’గా ప్రధాని పిలిచారు. డిజిటల్ యుగంలో ప్రపంచంలో మైక్రోప్రాసెసర్ల ప్రాముఖ్యతను ప్రధాని మోడీ నొక్కిచెప్పారు.

ఈ రంగంలో ఇప్పటి వరకు తైవాన్, చైనా, దక్షిణ కొరియా, అమెరికా గుత్తాధిపత్యం నడిచేది. ఇప్పుడు భారత్ కూడా ఈ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లైంది. మన చేతి గడియారం నుంచి శాటిలైట్లు, రాకెట్లు ఇలా ప్రతీ దాంట్లో ఈ మైక్రోప్రాసెసర్లు చాలా కీలకం. ఇప్పుడు భారత్ సెమీకండక్టర్, మైక్రోప్రాసెసర్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం అంచనా వేసిన 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని దాటుతుందని అంచనా. భారత్‌లో సెమీకండర్టర్ భవిష్యత్తును నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: 2020 Delhi riots: ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరణ..

భారతదేశ ‘విక్రమ్’ మైక్రోప్రాసెసర్ ప్రత్యేకతలు ఇవే:

విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, ఇది దేశీయ తొలి 32-బిట్ మైక్రోప్రాసెసర్. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. విక్రమ్32 అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా పనిచేసేలా రూపొందించారు. ఇది -55 డిగ్రీ సెల్సియస్ నుంచి 125 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.

అయితే, ఇది సాధారణ ల్యాప్‌లాప్‌లో ఉపయోగించే చిప్ సెట్ కాదు, దీనిని పూర్తిగా అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించారు. రాకెట్స్, శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్ వంటి పరికరాల్లో దీనిని వినియోగించనున్నారు. 2009లో విడుదలైన విక్రమ్-1601కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా భావించవచ్చు.

ఇది కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్‌తో కూడిన 32-బిట్ మైక్రోప్రాసెసర్. ఒకేసారి 32 బిట్‌ల డేటాను నిర్వహించగలదు. అనేక రకాల ఆర్డర్లను అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి ప్రోగ్రామ్ చేయవచ్చు. అంటే ఇది ఇన్‌స్ట్రక్షన్ సెంట్ ఆర్కిటెక్చర్ లేదా ఐఎస్ఏ. ఇది Ada ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి హైలెవల్ సపోర్టు ఇస్తుంది.

అంతరిక్ష వాతావరణం చాలా సున్నితంగా ఉంటుంది. రాకెట్స్ సరైన మార్గంలో ప్రయాణించేందుకు, శాటిలైట్ సరైన కక్ష్యలో చేరేందుకు ఈ చిప్‌సెట్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ చిప్‌ని మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో రూపొందించారు. విక్రమ్-32ను పీఎస్ఎల్వీ-సీ60 మిషన్‌లో ఉపయోగించి అంతరిక్షంలో పరీక్షించారు. ఆర్బిటల్ ఎక్స్‌పర్‌మెంట్ మాడ్యూల్‌లో మిషన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌గా దీనిని అమలు చేసిన తర్వాత ఇస్రోకు మంచి ఫలితాలు వచ్చాయి. ఇది వరకు ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో వాడే చిప్‌ కోసం భారత్ విదేశాలపై ఆధారపడేది. ఇప్పుడు విక్రమ్ ఆవిష్కరణతో భారత్ ‘‘ఆత్మ నిర్భర్’’గా మారినట్లు అయింది.

Exit mobile version