Tamil Nadu Politics: విజయ్‌ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్‌ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!

  • తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు కుట్ర కేసు..
  • ​ప్రభుత్వం కూల్చేందుకు ఏకంగా రూ.180 కోట్ల కేటాయింపు..
  • ​గిండిలోని ఓ హోటల్‌ వేదికగా కార్పొరేట్ సంస్థ వ్యూహరచన..
  • ​పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన సంచలన నిజాలు..
  • ​హోటల్‌లో వారం రోజుల పాటు బస చేసినట్టు నిందితుల గుర్తింపు..
Cmvijay

Cmvijay

Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చివేత చేసిన కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్ర వెనుక ఏకంగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారని, ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీనికి సంబంధించిన వ్యూహరచన చేసిందని తెలుస్తోంది. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నిందితులను విచారించగా ఈ నిజాలు బయటపడ్డాయి. స్థానిక గిండిలోని ఒక హోటల్‌ను ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. కార్పొరేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి తాము కూడా అక్కడ వారం రోజుల పాటు బస చేసి, వ్యూహాలు సిద్ధం చేసినట్లు వారు అంగీకరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబర్ తిరునావుక్కరసుతో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడు అశోక్ కుమార్ కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. వారి ఆదేశాల మేరకే తాము ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు సహకరిస్తే రూ.35 కోట్లు ఇస్తామంటూ ఒక యూట్యూబర్ తనను సంప్రదించాడని టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఇప్పటి వరకు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ​ప్రస్తుతం పోలీసు వర్గాలు ఈ కుట్రకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఆ కార్పొరేట్ సంస్థ ఏది అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.