Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి

Cm Vijay

Cm Vijay

Vijay TVK Alliance: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కూటమి విస్తరణ అంశం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 9న TVK మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో కొత్త రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించడంతో పాటు కూటమికి కొత్త పేరు ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి MDMK, CPM, CPI, VCK, కాంగ్రెస్‌ పార్టీల నేతలను TVK ఆహ్వానించింది. గతంలో జరిగిన తొలి భేటీకి దూరంగా ఉన్న CPI, CPMలకు కూడా ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి భవిష్యత్‌ కార్యాచరణ, విస్తరణపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

వైకోకు గ్రీన్‌సిగ్నల్
MDMK నేత వైకో సెప్టెంబర్ 9న జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తాను ఈ భేటీకి వస్తానని ఆయన వెల్లడించారు. దీంతో మిత్రపక్షాల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహంపై చర్చలు మరింత కీలకంగా మారనున్నాయి. అయితే CPI మాత్రం TVK కూటమిపై కీలక వైఖరిని స్పష్టం చేసింది. కూటమిలో చేరబోమని, భవిష్యత్తులో మంత్రివర్గంలోనూ భాగస్వామ్యం కాబోమని తెలిపింది. అవసరమైతే బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని CPI స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 9 భేటీలో CPI వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది.

విజయ్‌ అడుగులపై కాంగ్రెస్‌ దృష్టి
విజయ్‌ను ప్రధానిగా చూడాలంటూ TVK ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయ అడుగులపై కాంగ్రెస్‌ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న జరిగే సమావేశంలో కూటమి విస్తరణ, మిత్రపక్షాల భాగస్వామ్యం, కొత్త రాజకీయ ఫ్రంట్‌ రూపకల్పన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే విజయ్‌ TVK చుట్టూ ఆసక్తి పెరుగుతున్న వేళ.. సెప్టెంబర్ 9 భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమికి కొత్త పేరు ఖరారవుతుందా? ఎవరెవరు విజయ్‌తో కలిసి నడుస్తారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.