NTV Telugu Site icon

BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?

Pm Modi

Pm Modi

BJP: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి(ఎన్డీయే) ఈసారి 400 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘‘ఆబ్ కీ బార్ 400 పార్’’ నినాదంతో బీజేపీ నేతలు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ సొంతగా 370కి పైగా స్థానాలు సాధించడంతో పాటు ఎన్డీయే కూటమి ఈ సారి 400+ స్థానాలను సాధిస్తుందని ప్రధాని మోడీతో సహా అమిత్ షా ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్నికల అనంతరం వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 350 నుంచి 400 మధ్య సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పాయి.

అయితే, బీజేపీ చెబుతున్నట్లు 400 సీట్లు గెలుచుకుంటే రికార్డ్ అని చెప్పవచ్చు. అంతకుముందు 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఈ రికార్డును సాధించింది. 414 సాధించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన సానుభూతి పవనాల మధ్య కాంగ్రెస్ ఈ మార్కుని సాధించింది.

Read Also: Mallikarjun Kharge : ఎన్నికల ఫలితాలు.. బ్యూరోక్రాట్లకు లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే.. ఏం చెప్పారో తెలుసా?

1984లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీలలో కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. యూపీలో 83, బీహార్‌లో 48, మహారాష్ట్రలో 43, గుజరాత్‌లో 24, అలాగే మధ్యప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 25, హర్యానాలో 10, ఢిల్లీలో 7, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పడకముందు యూపీలో 85 సీట్లు, బీహార్‌లో 54, మధ్యప్రదేశ్‌లో 40 ఎంపీ సీట్లు ఉన్నాయి. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో 299 స్థానాలకు గానూ 284 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాదాపుగా 95 శాతం సీట్లను సొంతం చేసుకుంది.

అయితే, ఈ సారి బీజేపీ ఈ రికార్డును మరోసారి పునరావృతం చేయాలని భావిస్తోంది. 2024 ఎన్నికలు మొత్తం ఈ 400 సీట్ల చుట్టే తిరిగింది. ఈ మార్కు సాధించాలంటే బీజేపీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఈ రాష్ట్రాల్లో్ మిత్రపక్షాలతో కలిసి క్లీన్‌స్వీప్ చేస్తేనే సాధ్యపడుతుంది. వీటిలో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు సాధిస్తుందనే లెక్కపై ‘‘400 పార్’’ ఆధారపడి ఉంది.

మూడు రోజుల క్రితం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందని లెక్కలేశారు. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా మరియు ఇండియా TV-CNX – బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) 401 స్థానాలను సాధిస్తుందని చెప్పింది. న్యూస్24-టుడేస్ చాణక్య – ఇది 400 సీట్లలను గెలుచుకుంటుందని అంచనా వేయగా, ABP న్యూస్-సి ఓటర్, జన్ కీ బాత్ మరియు న్యూస్ నేషన్ వరసగా 383, 392, 378 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పింది.