Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..

  • తమిళనాడులో రాజకీయ వివాదంగా వీరమణి కేసు..
  • వీరమణి కేసుపై స్టాలిన్ నోరు విప్పాలన్న సీఎం విజయ్..
  • డీఎంకే ప్రభుత్వం ఈ కేసును ముందుకు సాగించలేదని విమర్శ..
  • ఈ కేసును టీవీకే రాజకీయం కోసం వాడుతోందని స్టాలిన్ ప్రతివిమర్శ..
Cm Vijay

Cm Vijay

Veeramani Case: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడులో తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం విజయ్, డీఎంకే పార్టీ, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశారు. అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్, స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. ‘‘స్టాలిన్ సర్ నోరు విప్పండి’’ అని అడిగారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఫిర్యాదు నమోదైనా కేసు ముందుకు సాగలేదని, దర్యాప్తు ప్రశ్నార్థకంగా ఉందని విజయ్ ఆరోపించారు.

వీరమణి కేసు 2025 అక్టోబర్‌లోనే పోలీసుల దృష్టికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. బాలల హక్కుల కార్యకర్త ద్వారా, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్ పోలీసులకు అందింది. ఆ తర్వాత వీరమణిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రాథమిక దర్యాప్తు 5 నెలల కొనసాగిన తర్వాత సరైన ఆధారాలు లేవనే కారణంతో పోలీసులు క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. వీడియో ఒరిజినల్ కాపీ లభించకపోవడం, వీడియోలో ఉన్న బాలికల్ని గుర్తించలేకపోవడం వంటి అంశాలు కూడా అప్పట్లో దర్యాప్తులో ప్రస్తావించారు.

అయితే, పోక్సో కేసు ఈ క్లోజర్ రిపోర్టును అంగీకరించలేదు. మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించింది. విజయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో వీరమణితో పాటు ఆయన సహాయకులు శాంతి, మహేంద్ర సిమ్హన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితుల్ని గుర్తించి వారి వాంగ్మూలాలు తీసుకున్నారు.

విజయ్ ఈ కేసుపై మాట్లాడుతూ.. ఈ కేసులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య అవగాహణ ఉందని ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్ని ఎంకే స్టాలిన్ ఖండించారు. తన ప్రభుత్వం వీరమణిని కాపాడేందుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. వీరమణి, అతడికి సహకరించినవారు చట్టపరంగా శిక్ష ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. టీవీకే దీనిని రాజకీయం కోసం ఉపయోగిస్తోందని విమర్శించారు.