VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్‌ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?

  • పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్‌ఏ బిల్లు’
  • ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత
  • ‘‘వెరీ బ్యాడ్ శిక్షా యాక్ట్’’గా కాంగ్రెస్ వ్యాఖ్య
Vbsa

Vbsa

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎంపీలు బీజేపీలో చేరడం, నీట్ ఎగ్జామ్ రద్దు చేయడం తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ఈసారి హాట్‌హాట్‌గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఆమోదం కాని కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో వీబీఎస్ఏ బిల్లు తెచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే ఈ బిల్లును ఎన్డీఏ రాష్ట్రాలతో పాటు ప్రతిపక్ష రాష్ట్రాలు, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘‘వెరీ బ్యాడ్ శిక్షా యాక్ట్’’ అంటూ ఇప్పటికే కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

బిల్లు లక్ష్యం ఇదే..

దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విక్సిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు-2025పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ బిల్లును కాంగ్రెస్ మాత్రమే కాకుండా, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం ఉన్నత విద్యపై అధిక నియంత్రణ సాధించేందుకు ఈ బిల్లును తీసుకొస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

VBSA బిల్లు అంటే ఏమిటి?

ప్రస్తుతం ఉన్నత విద్యను పర్యవేక్షిస్తున్న మూడు ప్రధాన సంస్థలు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) వీటిని రద్దు చేసి వాటి స్థానంలో విక్సిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) అనే ఒకే అత్యున్నత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లును 2025 డిసెంబర్ 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ పురందేశ్వరి అధ్యక్షతన ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఈ బిల్లును పరిశీలిస్తోంది. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది.

రాష్ట్రాల అభ్యంతరాలు ఏంటి?

ఆశ్చర్యకరంగా బీజేపీ మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు కూడా ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయతో పాటు కాంగ్రెస్ పాలిత తెలంగాణ కూడా కేంద్రం అధికారాలను అతిగా విస్తరిస్తోందని పేర్కొన్నాయి. టీడీపీ ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన అభిప్రాయంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిర్ణయాల ముందు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలని కోరింది. క్లాజ్-11 ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే డిగ్రీలు ఇచ్చే అధికారం కల్పించడం రాజ్యాంగపరమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలు కేంద్రం తీసుకోకుండా ప్రత్యేక రక్షణ నిబంధనలు ఉండాలని సూచించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొంది. మేఘాలయ ప్రభుత్వం కేంద్రం నాణ్యత, ప్రమాణాలు, అక్రిడిటేషన్‌ను మాత్రమే పర్యవేక్షించాలని, కానీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఏర్పాటు, పాలన, సిబ్బంది నియామకాలు, ఆర్థిక నిర్వహణ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని సూచించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం క్లాజ్-11 తొలగించాలని ఫీజు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు చేర్చాలని క్లాజ్-45 అత్యంత కేంద్రీకరణకు దారితీసే నిబంధన అని అభిప్రాయపడింది.

వివాదాస్పద క్లాజులు ఏవి?

క్లాజ్-45
ఈ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం VBSA కమిషన్‌కు విధానపరమైన ఆదేశాలు ఇవ్వవచ్చు. ఏ అంశం విధానపరమైనదో నిర్ణయించే తుది అధికారం కూడా కేంద్రానిదే.

క్లాజ్-47

ఈ క్లాజ్ ప్రకారం కేంద్రం VBSA కమిషన్‌ను లేదా దాని కౌన్సిళ్లను ఆరు నెలల పాటు రద్దు చేయవచ్చు. అవసరమైతే మరో ఆరు నెలలు పొడిగించవచ్చు.

క్లాజ్-49

ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఉన్నత విద్యా చట్టాలన్నింటికంటే దీనికే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొనడం కూడా వివాదానికి కారణమైంది.

విశ్వవిద్యాలయాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU), రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ, IIIT చిత్తూరు, మహారాష్ట్ర, అసోం, జమ్మూకశ్మీర్ విశ్వవిద్యాలయాలు ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వాటి ప్రధాన వాదనలు… క్లాజ్-45 వల్ల నియంత్రణ సంస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. క్లాజ్-47 ద్వారా స్వతంత్ర నియంత్రణ సంస్థ ప్రభుత్వ విభాగంలా మారే ప్రమాదం ఉంది. UGC, AICTE, NCTEలను ఒకేసారి రద్దు చేయడం వల్ల విద్యా వ్యవస్థలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సంస్కరణలను దశలవారీగా అమలు చేయాలని సూచించాయి.

నియామకాలపై కూడా విమర్శలు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ మాట్లాడుతూ… సెర్చ్ కమిటీలో కేంద్ర ప్రతినిధులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, న్యాయవ్యవస్థకు తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. ఆర్జేడీ ఎంపీ సంజయ్ కుమార్ ఝా కూడా కీలక అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ బిల్లును ‘‘Very Bad Shiksha Act (VBSA)’’గా అభివర్ణించారు.

నాలుగు ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

1. రాజ్యాంగ విరుద్ధం

ఈ బిల్లు రాష్ట్రాల అధికారాలను హరించి కేంద్రానికి అధికారం ఇస్తోందని, ఇది భారత సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ఆరోపించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎంపీలు బీజేపీలో చేరడం, నీట్ ఎగ్జామ్ రద్దు చేయడం తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ఈసారి హాట్‌హాట్‌గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2. గ్రాంట్స్ కౌన్సిల్ లేకపోవడం

జాతీయ విద్యా విధానం (NEP-2020)లో ప్రత్యేక గ్రాంట్స్ కౌన్సిల్ ప్రతిపాదించగా, ఈ బిల్లులో దానిని తొలగించి నిధుల పంపిణీ అధికారాన్ని విద్యాశాఖ చేతుల్లోకి తీసుకువెళ్తోందని విమర్శించారు.

3. IITలు, IIMల స్వయం ప్రతిపత్తికి ముప్పు

క్లాజ్-49 కారణంగా IITలు, IIMలు, NITలు, IIITలు, IISERలు కూడా VBSA నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని, వాటి స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

4. విశ్వవిద్యాలయాల సంప్రదింపుల వ్యవస్థ బలహీనత

ప్రస్తుతం UGC విశ్వవిద్యాలయాలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటుండగా, కొత్త బిల్లులో కౌన్సిళ్లకు విస్తృత అధికారాలు ఇచ్చి విశ్వవిద్యాలయాల పాత్రను తగ్గించారని ఆరోపించింది. జైరాం రమేష్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు.

కేంద్రం ఏమంటోంది?

విద్యాశాఖ మాత్రం ఈ విమర్శలను తిరస్కరించింది. కేంద్రం ప్రకారం… ఈ బిల్లు జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలుకు అనుగుణంగా రూపొందించబడింది. ఉన్నత విద్యా నియంత్రణను సరళీకృతం చేసి ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం. క్లాజ్-45, క్లాజ్-47 వంటి నిబంధనలు ఇప్పటికే UGC, AICTE, NCTE చట్టాల్లో కూడా ఉన్నాయని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుంటుందని, దీనివల్ల స్వయం ప్రతిపత్తికి ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేసింది.