Site icon NTV Telugu

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ హిమపాతంలో 9కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Uttarakhand Avalanche

Uttarakhand Avalanche

Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ హిమపాతంలో గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్‌ఐఎం) హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో హిమపాతం సంభవించి వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండ శిఖరం వద్ద వారంతా చిక్కుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సహయక, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.

మొత్తం 41 మంది ట్రైనీ పర్వతారోహకుల టీము హిమపాతంలో చిక్కుకుంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించి వారి సంఖ్య 9కి చేరింది. ఇంకా 29 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మంగళవారం డోక్రానీ బమాక్ హిమనీనదం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన రోజే నాలుగు మృతదేహాలను వెలికితీశారు. గురువారం మరో ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Flag War : భారత్-పాక్‌ల మధ్య జెండా యుద్ధం.. దేశంలో అతి పెద్దదైన జెండా ఏర్పాటుకు సిద్ధం

జమ్మూ కాశ్మీర్ గుల్ మార్గ్ లోని ఆర్మీ హై ఆల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్ నుంచి 14 మంది నిపుణుల బృందాన్ని రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపారు. రెస్య్కూ ఆపరేషన్ కోసం మరిన్ని టీములను ఐటీబీపీ మట్లీ, ఉత్తరకాశీ నుంచి బేస్ క్యాంపులకు పంపారు. 16000 అడుగుల ఎత్తులో ఆధునాతన హెలికాప్టర్ ల్యాండింగ్ గ్రౌండ్ సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే రాబోయే మూడు రోజులు వర్షం, మంచు కురిసే అవకాశం ఉండటంతో ఉత్తర కాశీ జిల్లా యంత్రాంగం రాబోయే మూడు రోజులు ట్రెక్కింగ్ , పర్వతారోహణ కార్యక్రమాలను నిషేధించింది.

విషాదం ఏమిటంటే ఈ హిమపాతం ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖ పర్వతారోహకురాలు సవితా కన్స్వాల్ కూడా ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో ఎవరెస్ట్, మకాలు పర్వతాలను అధిరోహించి జాతీయ రికార్డు సృష్టించారు సవితా కన్స్వాల్. హిమపాతం సంభవించిన 17,000 అడుగుల ఎత్తైన ప్రాంతాన్ని బుధవారం ఉత్తరాఖండ్ సీఎ పుష్కర్ సింగ్ ధామి సందర్శించారు.

Exit mobile version