Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలింది. జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనక ఉన్న చాయీ గ్రామ సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇంత వరకు దాని శకలాలు లభ్యం కాలేదు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు మరణించినట్లే అని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానిక యంత్రాంగం, రెస్క్యూ టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ట్రాన్స్ భారత్ కంపెనీకి చెందినది. ఇది ఫాటా నుంచి బద్రీనాథ్ వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల్లో ఉన్న వారిని చంద్రకాంత్, రాజశ్రీ, దినేష్, ఆకాష్, అథర్వ అనే ఐదుగురు ప్రయాణికులతో పాటు పైలట్ హిమాంశుగా గుర్తించారు. వీరు సజీవంగా ఉన్నారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న ప్రాంతంలో దట్టమైన మేఘాలు, వర్షం కురుస్తోంది. విజిబిలిటీ కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హెలికాప్టర్ ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం బద్రీనాథ్, జోషిమఠ్ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం మరో రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
హెలికాప్టర్ కుప్పకూలిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. ప్రయాణికులు క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు ముందు అక్టోబర్ నెలలోనే చార్ధామ్ యాత్ర సమయంలో రెండు హెలికాప్టర్లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. రుద్ర ప్రయాగ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఒక హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ కాగా, టెహ్రీలో టెక్నికల్ ఇష్యూ కారణంగా మరో హెలికాప్టర్ ల్యాండ్ అయింది.

