దేశంలో ఎక్కడ చూసినా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తరాఖాండ్ లోని డ్రెహ్రడూన్ లో గతంలో లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, రుద్ర ప్రయాగ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో వరదలు వచ్చి గ్రామాలన్ని నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖాండ్ మొత్తం విలవిలాడిపోతుంది.
ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్డు కనిపిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోతున్నాయి. వరదలతో మూగజీవాలు, జనాలు నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. దేవల్ లోని మోపాటా ప్రాంతాల్లో వరదల ఉదృతికి భార్యా భర్తలిద్దరూ కొట్టుకునిపోయారు. గోశాలలో ఉన్న 20 మూగజీవాలు నీటిలో మునిగి చనిపోయాయి. అదేవిధంగా రుద్ర ప్రయాగలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.
భారీ వర్షాలతో అలకనంద, మందాకిని నదుల సంగమంలోని నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
వరదల్లో గల్లంతైన వారిని వెతకాలని అధికారులను ఆదేశించారు సీఎం పుష్కర్ సింగ్. సహాయక చర్యలు కొనసాగించాలన్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పడు తనకు నివేధిక ఇవ్వాలని అధికారులకు తెలిపారు.
