NTV Telugu Site icon

India On USAID: ‘‘భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం’’.. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన..

Usaid

Usaid

India On USAID: భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనే ఉద్ధేశ్యంతో, 21 మిలియన్ డాలర్లను గత అమెరికా ప్రభుత్వం కేటాయించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’, రాహుల్ గాంధీలు ఈ నిధుల్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘‘ ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళనకరమైనవి’’గా అభివర్ణించారు. సంబంధిత అధికారులు వీటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. “అమెరికా కార్యకలాపాలు మరియు నిధులకు సంబంధించి అమెరికా పరిపాలన విడుదల చేసిన సమాచారాన్ని మేము చూశాము. ఇవి స్పష్టంగా చాలా బాధ కలిగించేవి. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనలకు దారితీసింది” అని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చురుకుగా పరిశీలిస్తోందని, ఈ దశలో వివరణాత్మక బహిరంగ ప్రకటన చేయడం లేదని వెల్లడించారు.

Read Also: Maoist : మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ

ఈ వారం ప్రారంభంలో మియామీలో ఒక ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశానికి యూఎస్ ఎయిడ్ గ్రాంట్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జోబైడెన్ ప్రభుత్వం భారతదేశంలో వేరొకరని ఎన్నుకోవడానికి ప్రయత్నించిందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో ఓటర్ల సంఖ్య కోసం మన 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చు చేయాలి..? వారు(బైడెన్ అడ్మినిస్ట్రేషన్) వేరొకరిని ఎన్నుకునేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు బీజేపీ గత కొంత కాలంగా కాంగ్రెస్, జార్జ్ సోరోస్‌, అమెరికా డీప్ స్టేట్‌పై చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చాయి. రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ బీజేపీ దాడి చేస్తో్ంది. అయితే, ఇప్పటి వరకు దీనిపై వీరు స్పందించలేదు. మరోవైపు, 2008 నుంచి భారతదేశంలో ఎన్నికల ప్రాజెక్టుకు సంబంధించి USAID గ్రాంట్ కేటాయించబడలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తు నివేదిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ఓటర్ భాగస్వామ్యం కోసం ‘‘అమర్ ఓటు అమర్’’(నా ఓటు నాది) అనే ప్రాజెక్టు కోసం 2022లో యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు వచ్చాయని తెలిపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికను ఉటంకిస్తూ, బీజేపీ తమకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అంతకుముందు బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రాహుల్ గాంధీని దేశద్రోహిగా, భారతదేశాన్ని బలహీనపరిచే కుట్ర పన్నినట్లు ఆరోపించింది.