Uttar Pradesh Minister’s Comments on Madrasa Students: ఉత్తర్ ప్రదేశ్ లోని మదర్సా విద్యార్థులకు గణితం, సైన్స్ బోధిస్తామని.. తద్వారా విద్యార్థులు మౌళ్వీలకు బదులుగా అధికారులు అవుతారని ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ధరంపాల్ సింగ్ మంగళవారం అన్నారు. మదర్సా విద్యార్థులు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్రమోదీ విజన్ అని.. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాలను స్వాధీనం చేసుకుని పాఠశాలలు, అసుపత్రులను నిర్మిస్తామని మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి అయిన ధరంపాల్ సింగ్ వెల్లడించారు.
Read Also: T20 World Cup: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ
మదర్సా విద్యార్థులు ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ల్యాప్‌టాప్ ఉండాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని.. విద్యార్థులకు గణితం, సైన్స్, సాంఘిక శాస్త్ర, హిందీ ఇతర సబ్జెక్టులను బోధిస్తామని ఆయన అన్నారు. మతపరమైన మౌళ్వీలు కాకుండా ఇంజనీర్లు, వైద్యులుగా మారాలని.. సివిల్ సర్వీస్ ఉద్యోగులు కావాలని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరుపై మంత్రి ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి ఉహించని విధంగా ఉత్తర్ ప్రదేశ్ ని.. ఉత్తమ్ ప్రదేశ్ గా మారుస్తున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు చాలా వరకు అక్రమంగా ఆక్రమించబడ్డాయని.. వీటిని ఖాళీ చేసి పాఠశాలలు, ఆస్పత్రులను, పార్కులను నిర్మిస్తామని వెల్లడించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 2000-4000 పశువులు ఉండేలా గోవంశ్ స్థలా(ఆవుల షెడ్) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.