Bihar CM Hijab Incident: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక కార్యక్రమంలో ఓ ముస్లిం మహిళ హిజాబ్‌ను తొలగించిన ఘటనను సమర్థిస్తూ ఉత్తరప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిషాద్ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. హిజాబ్‌ను తాకడానికే ఇంత హడావుడి అవసరమా? మరెక్కడైనా తాకితే ఏమయ్యేది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర అభ్యంతరానికి కారణమవుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పలువురు రాజకీయ నేతలు, మహిళా సంఘాలు విమర్శించాయి.
Read Also: Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
ఇక, మహిళల గౌరవం, మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం తగదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నితీశ్ కుమార్ చర్యలపై వివరణ ఇవ్వాలని, సంజయ్ నిషాద్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, ముస్లింలు, దళితుల పట్ల బీజేపీ నేతల ఆలోచన ఎలా ఉందో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
అయితే, ఈ అంశంపై చెలరేగిన విమర్శలపై స్పందించిన మంత్రి సంజయ్ నిషాద్.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. నితీశ్ కుమార్ నియామక పత్రం సరైన వ్యక్తికే అందుతుందా లేదా అన్నది నిర్ధారించుకోవడానికే హిజాబ్‌ను తాకారని, ఇందులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. ఇక, నియామక పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక మహిళా ఆయుష్ వైద్యురాలికి నియామక పత్రం అందజేస్తూ, ఆమె ముఖాన్ని చూసేందుకు హిజాబ్‌ను తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, నితీశ్‌ను ఆపేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తుంది.
