Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక ముస్లిం ఇంటిపై ‘‘వందేమాతరం’’, ‘‘భగత్ సింగ్’’ అనే పదాలు రాసి ఉండటంతో మతపెద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్లో జరిగింది. ఈ వ్యాఖ్యలు ఉండటాన్ని చూసిన ఇమాన్, ఆ ఇంట్లో నివసిస్తున్న ముస్లిం కుటుంబానికి చెందిన యువతి పెళ్లి నిర్వహించడానికి నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై న్యాయవాది మోనిష్ ఫిర్యాదు చేయడంతో ఇమామ్ మహ్మద్ సుర్ఫాన్ రజా ఖాద్రీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
షాజహాన్‌పూర్‌లోని రోజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బర్మౌలా అర్జున్‌పూర్ గ్రామానికి చెందిన న్యాయవాది మోనిష్ తన సోదరి వివాహాన్ని నవంబర్ 15న నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి 15 రోజులు ముందుగానే స్థానిక మసీదు ఇమామ్ మహమ్మద్ సుర్ఫాన్ రజా ఖాద్రీని సంప్రదించారు. అయితే, వివాహానికి కొన్ని రోజుల ముందు ఇమామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కుటుంబంలోని కొందరు వ్యక్తులు చేస్తున్న పనులు మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ నికాహ్ నిర్వహించడానికి నిరాకరించినట్లు మోనిష్ ఆరోపించారు. ఇమామ్ నిరాకరించినప్పటికీ కుటుంబీకులు మరో ఖాజీని పిలిచి వివాహ వేడుకలు నిర్వహించారు.
మోనిష్ తన పేరుకు ముందు భగత్ సింగ్ అని రాసుకుంటానని, జైహింద్, వందేమాతరం నినాదాలు చేస్తానని తెలిపారు. తన ఇంటి నేమ్ ప్లేట్‌పై కూడా ఈ పదాలు రాయించుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, తాను పట్టించుకోలేదని అన్నారు. జాతీయ భావజాలం, హిందూ సంప్రదాయాలకు గౌరవించడం కారణంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

