UP Congress-SP Alliance: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిణామాలు వేగం మారుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే, యూపీలో కాంగ్రెస్ 181 అసెంబ్లీ స్థానాలు కోరుతూ ఎస్పీకి సమర్పించినట్లు చెబుతున్న ఒక జాబితా లీక్ కావడం సంచలనంగా మారుతోంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ దాదాపుగా 200 స్థానాలు అడుగుతున్నట్లు గతంలో పలు నివేదికలు వచ్చాయి.
నెలన్నర క్రితమే కాంగ్రెస్ ఈ 181 స్థానాల జాబితాను అఖిలేష్‌కు అందించినట్లు తెలుస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలిచిన పలు స్థానాలను కూడా కాంగ్రెస్ తన జాబితాలో చేర్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్య వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మూడు నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు కొన్ని జిల్లాల్లో రెండు నుంచి మూడు స్థానాలు కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కనీసం ఒక స్థానంలోనైనా పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ కోరుతున్న స్థానాల్లో పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంప్రదాయంగా బలమైన ప్రాంతాలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీలతో పాటు సహరాన్పూర్, ప్రయాగ్ రాజ్, వారణాసి, డియోరియా, గోరఖ్‌పూర్, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లోని పలు స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కోరుతున్న సీట్లలో 131 జనరల్, 45 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వుడ్ నియోజవర్గాలు ఉన్నాయి.

