UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మధ్య సీట్ల పంపకాల చర్చలు సోమవారం ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ తమకు 130 అసెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాను కూడా ఎస్పీకి అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కనీసం ఒక స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో చర్చించిన తర్వాతే స్పందిస్తామని ఎస్పీ నేతలు చెబుతున్నారు.
అమేథీ, రాయ్‌బరేలీపై కాంగ్రెస్ పట్టు..
సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ మొదట 180 స్థానాలు కోరగా, ప్రస్తుతం చర్చలు జరుగుతున్న వేళ 130 సీట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అమేథీ, రాయ్‌బరేలీ లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వారీగా కాంగ్రెస్ సమర్పించిన జాబితాలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ స్వగ్రామమైన సైఫాయిని మాత్రమే మినహాయించినట్లు తెలుస్తోంది.
15 నిమిషాల్లోనే ముగిసిన సమావేశం..
ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ నివాసంలో సోమవారం అధికారికంగా సీట్ల పంపకాల చర్చలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే ఎస్పీ నేత, ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి ‘‘మీరు ఏం నిర్ణయించుకున్నారు?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సమాధానంగా కాంగ్రెస్ నేతలు 130 అసెంబ్లీ స్థానాల జాబితానను ముందుంచినట్లు తెలుస్తోంది. దీనిపై అఖిలేష్‌తో చర్చించి చెబుతామని ఎస్పీ నేతలు చెప్పారు. కేవలం 15 నిమిషాల్లోనే తొలి సమావేశం ముగిసింది.
రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాల తుది నిర్నయం తీసుకుంటామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని కాంగ్రెన్ నేత ఆరాధన మిశ్రా మోనా అన్నారు. త్వరలో పొత్తు ఖరారు చేస్తామని, 2027లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

